Ramani Kalyanam | సహజనటి జయసుధ ముఖ్య అతిథిగా హాజరైన ‘రమణి కళ్యాణం’ చిత్ర టీజర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. సూర్య వశిష్ట, దీప్షిక ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాను కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసిన జయసుధ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని తాను స్వయంగా చూశానని, ఇది ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ మూవీ అని ప్రశంసించారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా అద్భుతమైన కథాబలాలు కనిపిస్తున్నాయని, రమణి కళ్యాణం కూడా ఆ కోవకు చెందినదేనని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల సహజ నటన, సంగీతం సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలుస్తాయని, మే 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.
హీరో సూర్య వశిష్ట తన అనుభవాలను పంచుకుంటూ, వీల్ చైర్‌కే పరిమితమై నటించడం ఒక సవాల్‌తో కూడిన అనుభవమని, దర్శకుడు విజయ్ ఈ కథను ఎంతో ప్రాణం పెట్టి తెరకెక్కించారని తెలిపారు. హీరోయిన్ దీప్షిక ఇందులో చూపులేని అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్లు చెబుతూ, ఈ కథ విన్నప్పుడు కలిగిన ఎమోషన్ సినిమా చూశాక కూడా అంతే బలంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ ఒక కొత్త ఆశను, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దర్శకత్వం వహించిన విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ, తన మిత్రుడు రామ్ జగదీష్ అద్భుతమైన మాటలు అందించారని, ఒక మంచి టీమ్ సపోర్ట్‌తో ప్యాషన్ కలిగిన నటీనటులతో ఈ సినిమాను రూపొందించామని వెల్లడించారు. జయసుధ గారు సినిమా చూసి మెచ్చుకోవడం తమ టీమ్ మొత్తానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి కూడా సినిమాలోని సంగీతం, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతు జొన్నలగడ్డ వంటి పేరున్న నటులు నటించిన ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని, అరవింద్ తిరుకోవెల ఛాయాగ్రహణాన్ని అందించారు. రామ్ జగదీష్ సంభాషణలు, స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 22న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.