Tollywood | శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్‌లో సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిత్రాలతో పాటు బడా చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు చాలా సినిమాలు రిలీజ్ అయిన ఒక్క మంచి హిట్ పడలేదు. గత వారం సిద్ధూ జొన్నలగడ్డ నటించిన జాక్.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ప్రేక్షకులను మెప్పిస్తుందనుకుంటే తీవ్రంగా నిరాశపరిచింది. ప్రదీప్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం కూడా పెద్ద హిట్ కాలేదు. అయితే ఈ వారం స్టార్ హీరోయిన్ తమన్నా ఓదెల 2, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలు రిలీజ్ కానున్నాయి. రవితేజ నా ఆటోగ్రాఫ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఓదెల 2’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తుంది. చనిపోయిన మనిషి ఆత్మ తిరిగి ఊళ్లోకి వచ్చి అరాచకం సృష్టిస్తే శివశక్తి అయిన ఒక మహిళ ఏం చేసిందనే పాయింట్ మీద ఓదెల 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఓదెల్ రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత కొద్ది రోజులుగా తమన్నా, సంపత్ నంది ఎడతెరిపి లేకుండా మూవీ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. దీంతో బిజినెస్ వర్గాలలో మూవీకి మంచి బజ్ వచ్చింది కాని మార్నింగ్ షో అయ్యాక సినిమాల ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన కూడా మా ఊరి పొలిమేర 2, విరూపాక్ష తరహాలో మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.
ఇక శుక్రవారం రాబోతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ . ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టు కళ్యాణ్ రామ్ చెప్పాడు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ రావడంతో సినిమాకి మంచి ప్రమోషన్ లభించింది. చివరి పదిహేను నిమిషాల క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరు కంటతడి పెట్టడం ఖాయమని ఎన్టీఆర్ చెప్పడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ మూవీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. మరోవైపు, మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన నా ఆటోగ్రాఫ్ ఏప్రిల్ 18న రీ రిలీజ్ కానుంది. మరి రీరిలీజ్‌లో ఈ చిత్రం ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఈ వారం ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్..ఆత్మ ఎలివేషన్ మధ్య పోటీ ఉంటుంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి. కాగా, ఈ వారం పోటీలో తలపడుతున్న కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా ఏడేళ్ల క్రితం ‘నా నువ్వే’ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు.