Rakul Preet Singh | రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు గ్లామర్ బొమ్మ కాదు. డ్యూయెట్లకే పరిమితమైన నటి కాదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నది. ప్రయోగాలకు సిద్ధపడుతున్నది. తాజాగా విడుదలైన ‘ఛత్రివాలీ’ అందుకు ఉదాహరణ. కండోమ్ టెస్టర్ పాత్రలో నటించి.. తానేమిటో నిరూపించుకుంది. నిజానికి రకుల్ చాలా లోతైన మనిషి. ఆమె మాటల్ని బట్టి ఆ గాఢత అర్థం చేసుకోవచ్చు.
కరోనా ఓ మంచి పని చేసింది. లాక్డౌన్ సమయంలో బాలీవుడ్‌కూ, ప్రాంతీయ సినిమాలకూ మధ్య ఉన్న విభజనరేఖ చెరిగిపోయింది. దీంతో దక్షిణాది చిత్రాల గురించి దేశానికంతా
తెలిసింది. వీక్షకులకు ఎంతో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది.
నిజమే, సినిమాల్లో మగవాళ్లదే ఆధిపత్యం. మనం నివసిస్తున్నదీ పురుషాధిక్యసమాజంలోనే. అంతమాత్రాన భయపడుతూ కూర్చోలేం. ఓటమిని అంగీకరించి వెనక్కి వెళ్లిపోలేం. నేను పురుషుడినా, స్త్రీనా అన్నది అప్రస్తుతం. నేనో స్టార్‌ని. నటన నా ప్రాణం. ఆ దృక్పథంతోనే నేను పరిశ్రమను చూస్తాను. అమ్మానాన్న కూడా ఎలాంటి వివక్ష లేకుండా పెంచారు నన్ను.
జీవితం పర్వతారోహణ లాంటిది. పైకి వెళ్లేకొద్దీ సవాళ్లే. అక్కడితో ఆగిపోతే.. చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే.. లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే. శిఖరాన్ని ముద్దాడాల్సిందే. పరిశ్రమ మీద మనదైన ముద్ర వేయాలంటే.. కష్టపడాలి, విమర్శల్ని తట్టుకోవాలి. అమితాబ్ సర్ సహా.. ప్రతి నటుడూ ఓ పాఠమే నాకు.
షూటింగ్ లేకపోతే నేను స్నేహితులతో కాలక్షేపం చేస్తాను. కుటుంబంతో గడుపుతాను. ఇంకా, గోల్ఫ్ ఆడతాను. ఇష్టమైన సినిమాలు చూస్తాను. కానీ ఎక్కువ రోజులు ఖాళీగా కూర్చోలేను. నేను వర్క్ హాలిక్! నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. పెళ్లే కాదు, దేని గురించీ ఆలోచించేంత సమయం లేదు.
గతాన్ని పట్టుకుని వేలాడటం నాకు ఇష్టం ఉండదు. సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. వాటినే తలుచుకుంటూ కుంగిపోవడమో, పొంగిపోవడమో తెలివైన పని కాదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం రాబోయే సినిమాల మీదే. ప్రతి స్క్రిప్ట్ జాగ్రత్తగా చదువుతాను. మాది సైనిక కుటుంబం. సవాళ్లను ఇష్టపడతాను.
గ్లామర్ కోసమో, డబ్బు కోసమో పరిశ్రమలోకి రావద్దనే చెబుతాను. రోజుకు రెండుమూడు గంటలు కూడా నిద్రపోని సందర్భాలున్నాయి. కడుపునిండా తినలేం. హాయిగా వీధుల్లో తిరగలేం. ఇష్టమైన రెస్టారెంట్స్‌కు వెళ్లలేం. మన జీవితం సినిమా షెడ్యూల్ చుట్టూ తిరుగుతుంది. ఆరు నూరైనా ఆ సమయానికి అందుబాటులో ఉండాల్సిందే. బలమైన సంకల్పం లేకపోతే పరిశ్రమలో బతకలేం.
“Rakul Preet Singh | గ్లామర్ డోస్ పెంచేసిన రకుల్ ప్రీత్ సింగ్..”