Avika Gor | తెలుగువారి ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్.. ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్గా అభిమానులను ఆకట్టుకుంది. ‘రాజుగారి గది-3’తో హారర్ చిత్రాల్లో సైతం అదరగొట్టగలనని నిరూపించుకుంది. ‘హారర్స్ ఆఫ్ ద హార్ట్-1920’తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నది. అంతేనా, నిర్మాతగా తానేమిటో నిరూపించుకునే ప్రయత్నమూ చేస్తున్నది. ‘పాప్‌కార్న్’తో మరోసారి టాలీవుడ్ ముందుకొచ్చిన అవికా కబుర్లు..
కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా కూడా గత ఏడాది నాకు చాలా మంచి చేసింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సమస్యలు, అనుభవాలతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని గ్రహించాను. ఇప్పటివరకూ నటన గురించే ఆలోచించాను. శరీరం మీద పెద్దగా దృష్టిపెట్టలేదు. అందరూ ‘బొద్దుపిల్ల’ అంటున్నారు. అందుకే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. బలంగా సంకల్పిస్తే ఏదైనా సాధించగలం.
కొత్త సంవత్సరంలో నాతోపాటు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. కొంత గ్యాప్ తర్వాత, ‘పాప్‌కార్న్’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. తెలుగువారి ఆదరణ మర్చిపోలేను. కెరీర్ ప్రారంభం నుంచీ నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. అన్నట్టు, ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతున్నా. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ప్లీజ్!
రెండేండ్ల క్రితం, అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించాను. ఇప్పటికి రెండు సినిమాలు తీశాం. ఈ ఏడాది ఒక సినిమా విడుదల కానుంది. మరిన్ని మంచి చిత్రాలు తీయాలన్నది నా కోరిక. ‘నిర్మాతగా మారడం అంటే కోరికోరి కొరివితో తల గోక్కున్నట్టే. చాలా రిస్క్’ అని చాలామంది హెచ్చరించారు. కానీ నేను చాలెంజ్‌గా తీసుకున్నా. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలే నన్ను ముందుకు నడిపిస్తాయి.
భిన్నమైన కథలకే మొగ్గు చూపుతాను. కథలో బలం ఉంటే ప్రతి పాత్రకూ ప్రాధాన్యం లభిస్తుంది. కష్టపడటం వరకే మన చేతుల్లో ఉంటుంది. జయాపజయాలను ప్రేక్షక దేవుళ్లు నిర్ణయిస్తారు. సృష్టిలో ఏం జరిగినా.. దాని వెనకాల ఓ కారణం ఉంటుంది. మనం చేయాల్సిందల్లా కాలంతోపాటు ముందుకు సాగడమే. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకుల వినోదమే నాకు ముఖ్యం. ఆ ప్రయత్నంలో ఎంత కష్టపడినా సంతోషంగానే ఉంటుంది.
“Avika Gor | ‘మిలింద్ వల్లే నేనిక్కడున్నా’..బాయ్‌ఫ్రెండ్‌పై అవికాగోర్ ప్రశంసలు”