Vijay Devarakonda | ఒక సినిమా చేయడం కాదు.. చేసిన సినిమాను ప్రమోట్ చేసుకోవడం కూడా తెలియాలి. అప్పుడే ప్రేక్షకుల దగ్గరకు ఆ సినిమా మరింత చేరువవుతుంది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ అందరికంటే రెండాకులు ఎక్కువే చదివాడు. ఈయనకు తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. ఫ్యామిలీ సినిమా చేసినా.. మాస్ సబ్జెక్టు చేసినా ప్రేక్షకుల దగ్గరకు సినిమాను తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈయన నటించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల కానుంది. రిలీజ్‌కు కేవలం రెండు వారాలు మాత్రమే ఉండటంతో ప్రమోషన్లో జోరు పెంచాడు రౌడీ బాయ్. మొన్నటి వరకు షూటింగ్ తోనే బిజీగా ఉన్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లతో బిజీబిజీగా ఉంది.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా సినిమా ప్రమోషన్ భుజం మీద వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన వరకు వచ్చిన ఈ విషయాన్ని వదులుకోవడం లేదు. సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేసుకోవాలో అంత బాగా చేసుకుంటున్నాడు. తాజాగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ హెల్త్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కు ముఖ్య అతిథిగా వచ్చాడు విజయ్ దేవరకొండ. నిజానికి ఆ ఈవెంట్‌కు సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ అక్కడికి వచ్చి కూడా తన సినిమాను ఫుల్‌గా ప్రమోట్ చేసుకున్నాడు ఈయన. లుంగీ లుక్ లో వచ్చి ఫ్యామిలీ స్టార్‌ను ప్రమోట్ చేశాడు విజయ్ దేవరకొండ. షూటింగ్ అయిపోయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఎక్కువ సేపు ఉండలేను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు విజయ్. కాకపోతే ఆయన లుంగీ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దాన్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది.. అలాగే తన సినిమాను కూడా ప్రమోషన్ లో తీసుకొచ్చినట్టు ఉంటుంది అని లుంగీతోనే వచ్చేశాడు విజయ్.
తెలుగులో ఇలాంటి డిఫరెంట్ ప్రమోషన్స్ చేయాలంటే రౌడీ బాయ్ తర్వాతే ఎవరైనా. బాలీవుడ్లో రణవీర్ సింగ్ ఇలాంటి ప్రయత్నాలు అప్పుడప్పుడు చేస్తుంటాడు. తెలుగులో మాత్రం కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే ఇలాంటివి చేసి ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటాడు. కేవలం టీఎఫ్జేఏ ఈవెంట్ లోనే కాదు ఐపీఎల్‌ను కూడా తన సినిమా కోసం వాడుకుంటున్నాడు ఈయన. కామెంటేటర్‌గా వెళ్లి ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రమోట్ చేయనున్నాడు. పరశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటు విజయ్.. అటు దర్శకుడి కెరీర్‌కు కీలకంగా మారింది. లక్కీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది.