Varun Tej | కొందరు హీరోలకు ఎక్స్పర్మెంట్స్ పెద్దగా వర్కవుట్ అవ్వవు. కానీ వాళ్లు మాత్రం ప్రయోగాలు చేయడం ఆపరు. అందులో వరుణ్ తేజ్ అందరికంటే ముందుంటాడు. కెరీర్ మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ చూపులన్నీ ప్రయోగాలపైనే ఉంటాయి. విభిన్నమైన కథలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు ఈ హీరో. మెగా కుటుంబం నుంచి వచ్చినా కూడా ఎందుకో మరి వాళ్ల రూట్లో కాకుండా కొత్త దారిలో వెళ్తున్నాడు వరుణ్ తేజ్. దానివల్లే ఇంకా మాస్ ఇమేజ్‌కు దూరంగా ఉన్నాడు ఈ హీరో. కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు వరుణ్ తేజ్‌కు మంచి హిట్స్ వచ్చాయి.. పైగా కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. అలా కాకుండా ఆయన ప్రయోగాల బాట పట్టిన ప్రతిసారి ఫలితం దారుణంగానే ఉంది.
ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ కూడా అదే పరిస్థితి. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం ఊహించినంతగా లేవు. తొలిరోజు అయితే మరీ దారుణంగా 2 కోట్ల ఓపెనింగ్ మాత్రమే వచ్చింది. మరోవైపు వరుణ్ తేజ్ ప్రయోగాలు కాకుండా కమర్షియల్ సినిమాలు చేసినపుడు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఆరేళ్ల కింద తొలిప్రేమ సినిమాకు మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ వచ్చింది.. దాని తర్వాత గద్దలకొండ గణేష్ సినిమాకు ఫస్ట్ డే 11 కోట్ల గ్రాస్ వచ్చింది. మిస్టర్ సినిమాకు కూడా 5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ అంతరిక్షం, కంచె, గాంఢీవదారి అర్జున, గని లాంటి సినిమాలు మాత్రం దారుణమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. ఫుల్ రన్‌లోనూ వీటి పరిస్థితి మారలేదు. ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ కూడా గత సినిమాల కంటే తక్కువ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది.
మూడు రోజుల తర్వాత కనీసం 10 కోట్ల షేర్ అయినా వసూలు చేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయిప్పుడు. ఎందుకంటే ఈ చిత్ర బడ్జెట్ 40 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. కానీ ఓపెనింగ్స్ చూస్తుంటే అందులో నాలుగో వంతు కూడా వచ్చేలా కనిపించడం లేదు. అదే జరిగితే వరుస ప్రయోగాలతో వరుణ్ తేజ్ కెరీర్ మరింత డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్లే. ఇప్పటికిప్పుడు ఈయన ఎక్స్పర్మెంట్స్ మానేసి.. హాయిగా కమర్షియల్ సినిమాలు చేస్తే గానీ కెరీర్ సెట్ అవ్వదు. ఎందుకంటే ఎఫ్ 2, ఫిదా, ఎఫ్ 3, తొలిప్రేమ లాంటి విజయాలన్నీ ఆయన సేఫ్ జోన్లో చేసినప్పుడు వచ్చినవే. అందుకే హాయిగా ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. అవే చేయాలని అభిమానులు కూడా చెబుతున్నారు. మరి వాళ్ల మాటను వరుణ్ తేజ్ ఎంతవరకు పట్టించుకుంటాడో చూడాలి.