Kalyan Ram | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. చాలా కాలం తర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఫాంటసీ యాక్షన్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ చేసింది. ప్రమోషన్లో భాగంగా కళ్యాణ్‌రామ్ పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.
కళ్యాణ్‌రామ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఓం 3డీ’ మూవీ తనను ఆర్థికంగా బాగా దెబ్బతీసిందని, ఈ మూవీ ఫలితం చూశాక బాగా ఫీలయినట్లు తాజాగా జరిగిన ఇంటర్వూలో తెలిపాడు. ఈ చిత్రంపై తన లెక్కలు పూర్తిగా తప్పాయని, ఈ సినిమా నష్టాల్ని రెండేళ్ళ తర్వాత వచ్చిన పటాస్ చిత్రం రికవరీ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక బింబిసార చిత్రాన్ని కూడా కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఈథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించాడు.