“మదరాసి’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మెస్మరైజ్ చేస్తాయి’ అన్నారు శివకార్తీకేయన్. ఆయన కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘మదరాసి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శివకార్తీకేయన్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో లవ్, యాక్షన్‌కు సమప్రాధాన్యత ఉంటుందని, ముఖ్యంగా పోరాట ఘట్టాలు థ్రిల్‌ని పంచుతాయని తెలిపారు.
‘చిరంజీవి, మహేష్‌బాబు వంటి పెద్ద స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన మురుగదాస్‌తో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా కథ కమర్షియల్ పంథాలోనే చాలా కొత్తగా ఉంటుంది. నా కెరీర్లోనే ప్రత్యేక చిత్రమని భావిస్తున్నా’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తనకు బెస్ట్‌ఫ్రెండ్ అని, ఇద్దరి కలయిలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయని, ఈ సినిమా మ్యూజికల్‌గా అలరిస్తుందని శివకార్తీకేయన్ తెలిపారు.
తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచులు ఒకేలా ఉంటాయని, చిన్నా పెద్ద తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారని ఆయన చెప్పారు. తన గత చిత్రాలు రెమో, వరుణ్డాక్టర్, కాలేజ్ డాన్, అమరన్లను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, అదే స్థాయిలో ‘మదరాసి’ని కూడా హిట్ చేస్తారనే నమ్మకం ఉందని శివకార్తీకేయన్ ధీమా వ్యక్తం చేశారు.