అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. దసరా సందర్భంగా నేడు టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో చిరంజీవి చేతిలో ఖడ్గాన్ని ధరించి దుష్టశిక్షణకు సిద్ధమైన యోధుడిలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయబోతున్నారని వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకురాబోతున్నట్లు తెలిసింది. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.