Tillu Square | ‘డీజే టిల్లు’ చిత్రంతో యువతరానికి చేరువయ్యారు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. హైదరాబాద్ లోకల్ యూత్ డీజే టిల్లుగా ఆయన పండించిన హాస్యం, సంభాషణలు బాగా గుర్తుండిపోయాయి. ఇప్పుడీ సినిమాకు స్వీక్వెల్గా ‘టిల్లు స్వేర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ‘టికెట్టే కొనకుండా’ ‘రాధిక’ వంటి పాటలు పాపులర్ అయ్యాయి.
తొలుత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయబోతున్నట్లు తాజా ప్రకటనలో నిర్మాణ సంస్థ వెల్లడించింది. కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ఈ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీతం: రామ్ మిరియాల.