Thug Life | ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం అలరించలేకపోయింది. మరోవైపు ఈ మూవీ కర్ణాటకలో విడుదల కాకపోయే సరికి భారీ నష్టాలు చవి చూసింది. ‘థగ్ లైఫ్’ సినిమా గురించి అది విడుదలైన రెండు మూడు రోజులకే జనాలు మాట్లాడుకోవడం మానేశారు. కమల్ గత చిత్రం భారతీయుడు 2 భారీ డిజాస్టర్ అయింది అనుకుంటే దానికన్నా పెద్ద డిజాస్టర్‌గా థగ్ లైఫ్ నిలిచింది. ఈ చిత్రంలో సింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, నాజర్ వంటి అగ్ర నటులు నటించారు.
మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. అయితే ‘నాయకుడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అందరు అనుకున్నారు. కాని ఏ మాత్రం అలరించలేకపోయింది. విడుదలైనప్పటి నుంచి నెగిటివ్ టాక్ రావడంతో ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వారం రోజుల్లో కూడా 100 కోట్ల మార్క్ దాటలేకపోవడంతో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టాలను మిగిల్చింది.ఇక ఈ మూవీకి సంబంధించి 130 కోట్లకు ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
అయితే, ఇప్పుడు చిత్రం ఫ్లాప్ కావడంతో ఆ మొత్తం ఇవ్వలేమని నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 30 కోట్లు తగ్గిస్తేనే విడుదల చేస్తామని నెట్‌ఫ్లిక్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే థగ్ లైఫ్ సినిమా విడుదలకు ముందు కన్నడ భాష గురించి కమల్ చేసిన కామెంట్స్ కన్నడిగులకు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ చెప్పడంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలను సైతం బ్యాన్ చేశారు. ఒకవేళ కర్ణాటకలో ఎక్కడైనా థగ్ లైఫ్ సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్లు తగలబెట్టేస్తామని వార్నింగ్ సైతం ఇచ్చాయి పలు సంస్థలు. థగ్ లైఫ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది.