Thug Life | భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం థగ్ లైఫ్. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు. చాలాయేళ్ల తర్వాత కమల్ హాసన్ విక్రమ్ తో విజయం అందుకున్నాడు. ఆ ఊపులో థగ్ లైఫ్ చిత్రం వచ్చింది కాబట్టి ఈ మూవీ కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందీ అనుకున్నారు. కానీ ఆ క్రేజ్ మొత్తం తుస్సుమంది. థగ్ లైఫ్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం కాదు కదా.. కనీసం కలెక్షన్స్ కూడా సాధించే పరిస్థితి లేదు. థగ్ లైఫ్ లో అంత స్టార్ కాస్ట్ ఉన్నా..తొలి రోజు కేవలం 18 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మౌత్ టాక్, రివ్యూస్ ఇంపాక్ట్ సినిమాలపై ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మూవీ మరోసారి నిరూపించింది.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన `భారతీయుడు 2` ఫస్ట్ డే రూ.25కోట్లు వసూలు చేయగా, `థగ్ లైఫ్` రూ.18కోట్లకే పరిమితమయ్యింది. అయితే ఈ మూవీ ఆడితే శని, ఆదివారం వరకే, ఆ తర్వాత నిలబడటం కష్టమనే చెప్పాలి. మిశ్రమ స్పందన అందుకున్న `థగ్ లైఫ్` చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.18 కోట్లు వసూలు చేయగా, ఇందులో రూ.15.4 కోట్లు తమిళనాడులో, రూ.1.5కోట్లు తెలుగులో, నార్త్ లో పది లక్షల వరకు మాత్రమే రాబట్టింది. మలయాళంలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఓవర్సీస్లో కోటికిపైగా వచ్చినట్టు తెలుస్తుంది. కర్ణాటకలో అయితే సినిమా విడుదలే కాలేదు.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మించారు. చిత్రంలో భారీ తారాగణం నటించడం, టాప్ టెక్నీషియన్లు, వీఎఫ్ఎక్స్, ప్రత్యేకమైన లోకేషన్లలో షూటింగ్, యాక్షన్ సీన్లు, ప్రమోషన్ల కారణంగా భారీగానే ఖర్చు చేశారు. సినిమా థియేటర్స్‌లోకి వచ్చే సరికి దాదాపు రూ.220 కోట్లు ఖర్చు అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. సినిమా చాలా స్లోగా ఉండటం, రెహ్మాన్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడం , శింబుని సరిగ్గా వాడుకోకపోవడం, త్రిష పాత్ర కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా లేకపోవడం మూవీకి మైనస్ అయింది. సినిమాకి అంతో ఇంతో ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ మాత్రమే బలంగా నిలిచాయి.