Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ చేసిన రాజస్తాన్‌కు చెందిన యువకుడు రాఖీ భాయ్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసి కీ జాన్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగిన తర్వాత ఈ ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ఫోన్ చేసిన యువకుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
‘ఈ నెల 30వ తేదీ నీకు ఆఖరి రోజు’ అంటూ ఆ ఫోన్ కాల్స్‌లో బెదిరించినట్లు రికార్డయ్యింది. ఇప్పటికే సల్మాన్‌ను లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ వంటి గ్యాంగ్స్టర్స్ టార్గెట్ చేశారు. సల్మాన్‌ను హత్య చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు వై కేటగిరి భద్రతను అందిస్తున్నది. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ నిందితుడిగా చేరినప్పటినుంచి గ్యాంగ్స్టర్స్ అతన్ని టార్గెట్ చేస్తున్నారు.