భారతీయ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్త ప్లాట్‌ఫామ్ ‘టీబీడీ’(త్రిబాణధారి). దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ ప్రారంభించిన ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ఇటీవలే దుబాయ్‌లో ఘనంగా లాంచ్ చేశారు. భారతదేశంలో రూట్ లెవల్లో విస్తరించేందుకు టీబీడీ ముందడుగు వేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఈ ఓటీటీ లోగో లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
సంస్థ ఫౌండర్, ఎండీ ధరమ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీలతో పాటు సౌత్ ఇండియా సీఈఓలుగా వ్యవహరిస్తున్న నిర్మాత డి.ఎస్.రావు, దర్శకుడు వి.సముద్ర ఇంకా వి.ఎన్.ఆదిత్య, చంద్రమహేశ్, ఇ.సత్తిబాబు, శివనాగు, డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి, సంతోషం సురేశ్, నటుడు దాసన్న తదితర వ్యాపార, చిత్రరంగప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సకుటుంబంగా చూసే కంటెంట్ మాత్రమే టిబీడీ ఓటీటీలో ఉంటుందని, సబ్స్క్రిప్షన్ కేవలం పది రూపాయలు మాత్రమేనని, చిన్న నిర్మాతలకు ఇక్కడ పెద్ద పీట వేస్తామని టీబీడీ ఫౌండర్, ఎండీ ధరమ్ గుప్తా తెలిపారు.