Ravi Teja| తన పని మీద గౌరవం, బాధ్యతతో పాటు నిబద్ధత కూడా ఉండే వ్యక్తి మాస్ మహారాజా రవితేజ. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, తన ప్రొఫెషనల్ కమిట్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడు. తాజాగా ఆయన చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మరణించారు. కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నా, రెండు రోజుల విరామం తీసుకుని మూడో రోజే ‘RT76’ సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు రవితేజ. ఈ ఘటన చిత్రబృందాన్ని, అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
నిర్మాతను దృష్టిలో పెట్టుకొని రవితేజ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని సంక్రాంతి 2026 విడుదల లక్ష్యంగా పెట్టుకున్నారు. షెడ్యూల్ వాయిదా పడితే నిర్మాతకు భారీ నష్టం వస్తుందని అర్థం చేసుకున్న రవితేజ, తన బాధను పక్కనబెట్టి సెట్స్‌లో అడుగుపెట్టారు. రవితేజ నిర్ణయం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
“ఇది నిజమైన డెడికేషన్ కి నిలువెత్తు ఉదాహరణ” అని దర్శకనిర్మాతలు ప్రశంసిస్తున్నారు. ‘RT76’ చిత్రంలో రవితేజ నూతన, డిఫరెంట్ షేడ్స్ తో కనిపించనున్నాడు.ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. అభిమానులకు ఇది మరో పక్కా మాస్ ఎంటర్టైనర్ కానుంది. కొన్నాళ్లుగా రవితేజ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని పలకరిస్తున్నా కూడా ఆ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ చిత్రంపై రవితేజ చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ మూవీ హిట్ అయితే రవితేజ ఫ్యాన్స్ ఆనందం కూడా అవధులు దాటుతుంది. కాగా, దర్శకుడు కిషోర్ తిరుమల ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘చిత్రలహరి’.. వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు