‘సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానంటూ అందరిని నమ్మిస్తూ బతుకుతుంటాడో దొంగ. అతడిని ఎలాగైనా చట్టప్రకారం శిక్షించాలని ఓ పోలీస్ ప్రయత్నిస్తుంటాడు? ఈ దొంగపోలీస్ ఆటలో గెలుపెవరిని వరించిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అంటున్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. మేఘాఆకాష్, సునైన కథానాయికలు. శుక్రవారం చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ టీజర్ సాగింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఓ దొంగ జీవిత గమనంలో ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటుంది. అంతర్లీనంగా వచ్చే ప్రేమకథ ఆహ్లాదాన్ని పంచుతుంది’ అని తెలిపారు. తనికెళ్లభరణి, గంగవ్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ: వేదరామన్.