రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ విషయంలో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా చల్లని వార్తే. వచ్చే ఏడాది సమ్మర్‌లోపు ఈ చిత్రం షూటింగ్‌ను ముగించనున్నట్టు సమాచారం. దాదాపు 90శాతం ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఇదిలావుంటే.. శంకర్ దర్శకత్వంలోనే కమల్‌హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ కూడా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీన్నిబట్టి ఒక రెండునెలలు అటుఇటుగా రెండు సినిమాలూ విడుదలయ్యే అవకాశం ఉందని సినీవర్గాల సమాచారం. ఇక రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ సినిమా విషయానికొస్తే, సమకాలీన రాజకీయాలను ప్రశ్నిస్తూ, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ శంకర్ తెరకెక్కిస్తున్న విప్లవాత్మక చిత్రంగా ‘గేమ్‌ఛేంజర్’ని చెప్పొచ్చు. ఇందులో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కైరా అద్వానీ, అంజలీ కథానాయికలు. ఇంకా శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.