టాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్, శ్రీరామ నవమి కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూలో చూద్దాం.
కథ
వరుణ్ (ప్రియదర్శి) సినిమాలకు శబ్దాలను సృష్టించే ‘ఫోలే’ (Foley) ఆర్టిస్ట్. అయితే, చిన్నప్పటి నుంచి అతనికి ‘సుయోధన’ అనే ఒక వింత శబ్దం వినిపిస్తూ, కళ్లముందు దుర్యోధనుడి ఆకారం కనిపిస్తూ భయపెడుతుంటుంది. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) గొప్ప నాటక కళాకారుడు. కొడుకు భయం పోగొట్టడం కోసం తనకిష్టమైన దుర్యోధన పాత్రలు వేయడం కూడా ఆపేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. వరుణ్ జీవితంలోకి హీరోయిన్ సమిత (ద్రిషిక చందర్) ప్రవేశించిన తర్వాత కథ మలుపు తిరుగుతుంది. తనకు వినిపించే ఆ శబ్దానికి, కనిపించే ఆ రూపానికి తన ప్రాణహానితో సంబంధం ఉందని వరుణ్ గుర్తిస్తాడు. ఈ క్రమంలో తన తండ్రిపై జరిగిన దాడి, దాని వెనుక ఉన్న రాజకీయ కోణాలు, అసలు ‘సుయోధన’ అంటే ఎవరు అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.
విశ్లేషణ
తెలుగు తెరపై ఇప్పటివరకు రాని ‘ఫోలే’ ఆర్టిస్ట్ నేపథ్యాన్ని దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకోవడం విశేషం. శబ్దాల రికార్డింగ్ ప్రక్రియను సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
నటీనటుల ప్రతిభ: ప్రియదర్శి తన కెరీర్లో మరో గుర్తుండిపోయే నటనను కనబరిచారని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ తన గంభీరమైన నటనతో, దుర్యోధనుడి గెటప్‌లో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో చిత్రానికి ప్రధాన బలమయ్యారు. సీనియర్ నటి ప్రేమ తల్లి పాత్రలో ఒదిగిపోయారు.
సాంకేతికంగా: థ్రిల్లర్ సినిమాలకు ప్రాణమైన ‘సౌండ్ డిజైన్’ ఈ చిత్రంలో అద్భుతంగా కుదిరింది. జై క్రిష్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తుంది. ప్రత్యేక ఆకర్షణగా ఈ చిత్రంలో హీరో సత్యదేవ్, బిత్తిరి సత్తి కీలక పాత్రల్లో మెరిసి కథలో భాగమయ్యారు.
చివరిగా.. కేవలం మిస్టరీ మాత్రమే కాకుండా మదర్ సెంటిమెంట్, పొలిటికల్ డ్రామా కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా, ఒక కొత్త తరహా సైకలాజికల్ థ్రిల్లర్‌ను చూడాలనుకునే వారికి ‘సుయోధన’ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది.