తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని డైలాగులు కేవలం థియేటర్లలో చప్పట్లు కొట్టించడానికే కాకుండా, మనుషుల ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే తత్వశాస్త్రంగా మిగిలిపోతాయి. అటువంటి వాటిలో రామ్ చరణ్ హీరోగా ఇటీవల వచ్చిన పెద్ది సినిమా లోని ‘పుడతామా ఏంటి మళ్లీ…’ అనే డైలాగ్ ఒకటి. ఈ ఒకే ఒక్క మాట వెనుక అపారమైన మానసిక శాస్త్ర కోణం దాగి ఉంది. ఈ డైలాగ్‌ను సైకాలజీ కోణంలో విశ్లేషిస్తే మానవ మనస్తత్వానికి సంబంధించి మూడు ముఖ్యమైన సత్యాలు కనిపిస్తాయి.
సైకాలజీలో ‘ఎగ్జిస్టెన్షియల్ థెరపీ’ అనే ఒక విధానం ఉంది. జీవితం శాశ్వతం కాదు, మరణం ఖాయం అని తెలిసినప్పుడు మనిషికి రెండు దారులు ఉంటాయి: ఒకటి నిరాశ పడటం, రెండు దొరికిన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడం.
‘పుడతామా ఏంటి మళ్లీ’ అనే ప్రశ్న మనిషికి జీవితంలోని నశ్వరత్వాన్ని గుర్తుచేస్తుంది. ఎప్పుడైతే రేపు అనేది మన చేతుల్లో లేదు, ఉన్నది ఈ ఒక్క జీవితమే అని మనసు బలంగా నమ్ముతుందో, అప్పుడు గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలపై లేదా భవిష్యత్తు గురించిన అనవసర ఆందోళనలపై మనసు సమయాన్ని వృథా చేయదు. ప్రస్తుత క్షణంలో అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడమే మానసిక ఆరోగ్యానికి మూలసూత్రం.
ఈ సినిమాలో హీరో ఎదుర్కొనే సవాళ్లు సామాన్యమైనవి కావు. ఇలాంటి స్థితిలో ఎవరైనా ‘నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది?’ అని డిప్రెషన్లోకి వెళ్లిపోవడం సహజం. సైకాలజీలో ‘ర్యాడికల్ యాక్సెప్టెన్స్’ అనే అంశం ఉంది. అంటే, మన చేతుల్లో లేని, మనం మార్చలేని కఠినమైన వాస్తవాలను నిస్సందేహంగా ఒప్పుకోవడం. పుడతామా ఏంటి మళ్లీ అనే డైలాగ్‌లో ఒక మానసిక పరిణతి కనిపిస్తుంది. సమస్యలని మార్చలేనప్పుడు, వాటి పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చుకోవడమే మానసిక ైస్థెర్యం అని గుర్తు చేస్తుంది.
ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని, మళ్లీ సాధారణ స్థితికి రాగలిగే మానసిక శక్తినే సైకాలజీలో ‘రెసిలియెన్స్’ అంటారు.
లోపల ఎంత బాధ ఉన్నా, పైకి నవ్వడం అనేది బలహీనత కాదు, అది ఒక అద్భుతమైన ‘కోపింగ్ మెకానిజం’. నవ్వడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, సెరటోనిన్ లాంటి ‘ఫీల్ గుడ్’ హార్మోన్లు విడుదలై, శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ డైలాగ్ ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం నుంచి తనను తాను కాపాడుకోవడానికి నిర్మించుకున్న ఒక మానసిక కవచం లాంటిది.
వీటన్నిటిలోనూ ర్యాడికల్ యాక్సెప్టెన్సీ చాలా ముఖ్యమైనది. మనం మార్చలేని కఠినమైన వాస్తవాన్ని నిస్సందేహంగా, ఎటువంటి నిందలు లేకుండా మనస్ఫూర్తిగా స్వీకరించడమే ర్యాడికల్ యాక్సెప్టెన్సీ. మనం ఒక బాధాకరమైన వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరించినప్పుడు, ఆ బాధ కాస్తా సఫరింగ్గా మారుతుంది. నిత్యజీవితంలో ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. రోడ్డుపై వెళ్తున్నప్పుడు భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. మీకు అత్యవసరమైన మీటింగ్ ఉంది. ఇక్కడ మీకు రెండు దారులు ఉన్నాయి.
సాధారణ ప్రతిస్పందన: స్టీరింగ్ మీద బాదడం, హారన్ కొట్టడం, ‘ఛా! నా రోజంతా పాడైపోయింది, ఈ ట్రాఫిక్ పాడుగాను’ అని అరవడం. దీనివల్ల ట్రాఫిక్ క్లియర్ అవ్వదు సరికదా, మీ బీపీ పెరిగి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.
ర్యాడికల్ యాక్సెప్టెన్స్ ప్రతిస్పందన: ‘నేను ట్రాఫిక్‌లో చిక్కుకున్నాను అనేది వాస్తవం. దీన్ని నేను మార్చలేను. కాబట్టి ఆఫీస్‌కు ఫోన్ చేసి లేట్ అవుతుందని ముందే సమాచారం ఇవ్వడం, కార్లో మంచి మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. ‘మనం బాధను మార్చలేకపోవచ్చు, కానీ, దానికి చూపే నిరోధకతను సున్నా చేస్తే సఫరింగ్ కూడా సున్నా అవుతుంది. దొరికిన జీవితాన్ని నవ్వుతూ బతకడానికి ఇదే అత్యంత కీలకమైన మైండ్ సెట్.
‘పెద్ది’ సినిమాలోని పుడతామా ఏంటి మళ్లీ డైలాగ్ నిరాశలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక కౌన్సెలింగ్ లాంటిది. జీవితంలో కష్టాలు రావడం సహజం, కానీ ఆ కష్టాలనే పట్టుకుని కూర్చుంటే ఉన్న ఒక్క జీవితం వృథా అయిపోతుంది. ‘పుడతామా ఏంటి మళ్లీ ?’ అని మనల్ని మనం ప్రశ్నించుకున్న రోజు… ఈ క్షణమే ఆనందంగా బతకడం ఎంత ముఖ్యమో మనసుకు
అర్థమవుతుంది.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261