The Sabarmati Report | బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే నటిస్తున్న తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report). రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాను నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. విక్రాంత్ మస్సే ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2002లో ఫిబ్రవరి 27న గుజరాత్లో జరిగిన గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా రానుంది.
అసలు ఏం జరిగిందంటే.. 2002లో ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుండగా ఎవరో చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా కొన్ని బోగీలపై రాళ్ల వర్షం మొదలైంది. ఎవరో దుండగులు ఓ బోగీపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. దాంతో ఆ బోగీలోని 59 మంది సజీవదహనమయ్యారు. ఈ రైలు అయోధ్య నుంచి తిరిగి వస్తున్న యాత్రికులతో ఉంది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. గోద్రా ఘటన అనంతరం అల్లర్లు గుజరాత్ అంతటా వ్యాపించాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారు.