‘భజేవాయువేగం’ చిత్రంలో తాను సంప్రదాయ పాత్రలో కనిపిస్తానని, తెలుగులో తన కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చే సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది ఐశ్వర్యమీనన్. ‘స్పై’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు ‘భజేవాయువేగం’ చిత్రంలో హీరో కార్తికేయ గుమ్మకొండ సరసన నటిస్తున్నది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా కథానాయిక ఐశ్వర్యమీనన్ సోమవారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నేను బ్యూటీషియన్ ఇందు పాత్రలో కనిపిస్తా. కథాగమనంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. హీరోని ఎంతగానో ఇష్టపడుతూ ప్రతి విషయంలో అతనికి అండగా నిలుస్తుంటాను. సినిమా మొత్తం నేను సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తా. నాకు ఈ తరహా క్యారెక్టర్స్ చాలా ఇష్టం. నిజజీవితంలో కూడా సంప్రదాయ వస్ర్తాలను ఇష్టపడతాను. చీరకట్టులోనే అసలైన అందం ఉంటుంది’ అని చెప్పింది. ‘స్పై’ సినిమా తర్వాత తెలుగులో చాలా ఆఫర్లొచ్చాయని, సెలెక్టివ్‌గా కథలను ఎంచుకుంటున్నానని, దక్షిణాది భాషల్లో తెలుగుకే తన తొలి ప్రాధాన్యత అని ఆమె పేర్కొంది. ‘భజేవాయువేగం’లో రొమాంటిక్ పార్ట్ తక్కువగా ఉంటుందని, యాక్షన్ అంశాలు కలబోసిన మాస్ కథాంశమిదని చెప్పింది. ‘కమర్షియల్ సినిమాల ద్వారా గుర్తింపుతెచ్చుకోవాలనుకుంటున్నా. తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా. మరో రెండు చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ఓ లవ్‌స్టోరీలో నటిస్తున్నా’ అని ఐశ్వర్యమీనన్ తెలిపింది.