The Paradise | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి రా రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాతో బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ గ్లింప్స్‌లో నాని చెప్పిన పంచ్ డైలాగులు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పేరున్న నాని ఇలాంటి మాస్ యాక్షన్ రోల్లో కనిపించడం అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. చిత్రబృందం 2026 మార్చి 26న ‘ది ప్యారడైజ్’ను గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
అయితే, ఇటీవల షెడ్యూల్ ఆలస్యం, కార్మికుల సమ్మె వంటి కారణాలతో షూటింగ్ కొంత మందగించింది. అయినప్పటికీ డెడ్‌లైన్‌ను అందుకోవడానికి యూనిట్ నిద్రహారాలు మానేసి తీవ్రంగా కష్టపడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్నారు. సెట్లో నాని, శ్రీకాంత్ ఓదెలతో పాటు మొత్తం టీమ్ రోజుకు కేవలం మూడు గంటలే నిద్రపోతూ, మిగతా సమయాన్ని షూటింగ్‌కి కేటాయిస్తున్నారని సమాచారం. ఈ డెడికేషన్ చూసిన సినీ అభిమానులు “డెడ్‌లైన్ కోసం ఇంతలా కష్టపడుతున్నారా?” అని ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో నాని పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే షూటింగ్ పూర్తికాకముందే భారీ రేటుకు అమ్ముడైన ప్రాజెక్ట్ ఇదేనని ఇండస్ట్రీ టాక్. ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ముందుగానే భారీ మొత్తాన్ని చెల్లించి రిలీజ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసిందట. ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌లో నాని పవర్ఫుల్ డైలాగులు, అదిరిపోయే బీజీఎం, స్టైలిష్ ప్రెజెంటేషన్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత విలన్ రోల్లో కనిపించబోతున్న ఆయన ప్రెజెన్స్ సినిమా రేంజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో ‘బుజ్జిగాడు’, ‘కన్నప్ప’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన మోహన్ బాబు, ఇప్పుడు నానితో తలపడబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుని ఫిట్‌గా మారినట్లు తెలుస్తోంది.