The Paradise | టాలీవుడ్లో ఇటీవల సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ఇరుముడి’ ఒకటిగా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు విడుదలైన తొలి రోజు నుంచే మంచి స్పందన లభించింది. పాజిటివ్ టాక్‌తో పాటు ప్రేక్షకుల ఆదరణ పెరగడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ లాంగ్ రన్‌ను నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమా విజయానికి కంటెంట్‌తో పాటు మరో అంశం కూడా బాగా కలిసొచ్చిందనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది. అదే సాధారణ టికెట్ ధరలు. భారీగా టికెట్ ధరలను పెంచకుండా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే రేట్లతో సినిమాను విడుదల చేయడం ‘ఇరుముడి’ విజయానికి అదనపు బలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు సాధారణంగా మారిపోయింది. భారీ బడ్జెట్, స్టార్ హీరో, పాన్ ఇండియా రిలీజ్ అంటూ స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ‘ఇరుముడి’ మాత్రం ఈ విషయంలో భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఎలాంటి భారీ టికెట్ హైక్‌లు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో నిరూపించింది. కుటుంబ ప్రేక్షకులు, సాధారణ సినీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడానికి అందుబాటులో ఉన్న టికెట్ ధరలు ఒక కారణమయ్యాయనే టాక్ వినిపిస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్ పెరుగుతున్న కొద్దీ ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగి, సినిమాకు మంచి లాంగ్ రన్ దక్కడంలో ఈ వ్యూహం కీలక పాత్ర పోషించిందని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదే సక్సెస్ మంత్రా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ అమలు అవుతుందా అనే ఆసక్తికర చర్చ మొదలైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సహజంగానే భారీ ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, సినిమా కాన్సెప్ట్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచాయి. ‘ఇరుముడి’ విజయాన్ని చూస్తున్న తర్వాత.. ‘ది ప్యారడైజ్’ కూడా సాధారణ టికెట్ ధరలతో విడుదలైతే అది సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నాని సినిమాలకు ఉన్న ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా థియేటర్లకు ఆకర్షించడంలో అందుబాటులో ఉండే ధరలు కీలకంగా మారే అవకాశం ఉంది.