Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో అనిల్ రావిపూడి నిర్మాత సాహు గారపాటితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా వసూళ్లు ఒక మిలియన్ దాటితే నిర్మాత తనను కారు అడిగారని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన నవ్వుతూ చెప్పారు. అయితే, ఈ వసూళ్లు మూడు దాటి నాలుగు మిలియన్లకు చేరితే మాత్రం నిర్మాత తనకు ఫామ్‌హౌస్ కొనివ్వాలని సరదాగా కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఆయన కారు అడుగుతారా లేదా అనేది ఆయన ఇష్టమని అనిల్ చేసిన వ్యాఖ్యలు వేదికపై నవ్వులు పూయించాయి.
ఈ సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ, తన కెరీర్లోనే అత్యంత వేగంగా కేవలం 25 రోజుల్లోనే ఈ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు అనిల్ వెల్లడించారు. చిరంజీవి గారిలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను మళ్లీ వెండితెరపై ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఈ కథ రాశానని, దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉందని తెలిపారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని, ఈ సక్సెస్‌లో వారి పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. ప్రస్తుతం ఈ చిత్రం అటు కామెడీతో, ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో థియేటర్లలో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది.