నర్తనశాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నాయిక కశ్మీర పరదేశి. ఏడాది విరామంలో బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది భాషల్లో అరంగేట్రం చేసిందీ భామ. ఆమె నటించిన తాజా చిత్రం‘వినరో భాగ్యము విష్ణుకథ’. కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. మురళి కిషోర్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపింది నాయిక కశ్మీరా పరదేశి.
దేవుడి ఆశీర్వాదంగా భావించా
నేను ముంబై నుంచి వచ్చాను. కొన్ని యాడ్స్‌లో మోడల్‌గా చేశాను. తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన ‘నర్తనశాల’ నా మొదటి సినిమా. అదే సమయంలో తమిళంలోనూ అవకాశాలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేయాలనేది నా కల. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా అవకాశం నేను చెన్నైలో ఉన్నప్పుడు వచ్చింది. ఆ ఫోన్ వచ్చే సమయంలో వెంకటేశ్వరస్వామి గుడిలో ఉన్నాను. ఈ అవకాశం దేవుడి ఆశీర్వాదం అనిపించింది. కథలో ఉన్న డ్రామా ఆకట్టుకుంది. ఆద్యంతం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. తిరుపతి నేపథ్యంగా సినిమా ఉంటుందని తెలియగానే మరింత ఆనందం కలిగింది. ఇలా సానుకూల ఆలోచనల మధ్య తిరుపతిలో షూటింగ్ ప్రారంభించాం. నెల రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్ చేశాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రీకరణ జరిగింది.
దర్శనగా
ఈ చిత్రంలో నా పాత్ర పేరు దర్శన. అందంగా కనిపించడమే కాదు తెలివైన అమ్మాయి కూడా. కేవలం పాటల్లో ఆడిపాడటమే కాకుండా ఈ క్యారెక్టర్లో నటించేందుకు ఆస్కారముంది. నా కంటే హీరోకు ఎక్కువ డ్యాన్సులు ఉంటాయి. కిరణ్ అబ్బవరం మంచి కోస్టార్. అతనితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఎలా నటించాలి అనేది మేమిద్దరం కలిసి చర్చించుకున్నాం. మురళీ కిషోర్ ప్రతిభ గల దర్శకుడు. తొలి చిత్రమైనా అందరికీ నచ్చేలా ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించారు. ఇటీవల సినిమాల్లో నాయికలకు కీలకమైన పాత్రలు దక్కడం మంచి పరిణామం. అన్ని ప్రాంతాల వారికి నేను చూసేందుకు వారి స్థానిక అమ్మాయిలా కనిపిస్తాను. ఇది నటిగా నాకు కలిసొచ్చే అంశం. అందుకే వివిధ భాషల్లో అవకాశాలు వస్తున్నాయి.
అదే టాలీవుడ్ ప్రత్యేకత
నేను ఇతర భాషల్లో నటించినా తెలుగు సినిమాను ఎక్కువ ఇష్టపడతాను. ఇక్కడ కంటెంట్‌తో కూడిన సినిమాలతోపాటు కమర్షియల్ చిత్రాలు కూడా ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్నారు. తెలుగులో నటించడాన్ని ఆస్వాదిస్తున్నాను.