ఇటీవలే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రష్మిక మందన్న. ఆధునిక స్త్రీ తాలూకు స్వేచ్ఛ, నిర్ణయాధికారం వంటి అంశాలను ఈ సినిమాలో బలంగా చర్చించారు. ఈ నేపథ్యంలో మహిళా శక్తి గొప్పతనాన్ని తెలియజేస్తూ రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘స్త్రీ శక్తిలో ఏదో తెలియని మహత్తు ఉంది. దానిని ఎలా వివరించాలో తెలియడం లేదు. ఈ శక్తి వల్ల మహిళలు కొన్ని ఉపద్రవాలను ముందే పసిగట్టగలరు. ప్రతికూల పరిస్థితులను అంచనా వేయగలుగుతారు’ అని రష్మిక మందన్న పేర్కొంది.
మహిళలు పరస్పరం సహకరించుకుంటే వారి జీవితాలు సులభంగా మారతాయని, స్త్రీ శక్తి గురించి తెలుసుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చింది. ‘నా మిత్రబృందం అనుక్షణం నా వెంట ఉంటూ నన్ను రక్షిస్తున్నారు. అమ్మాయిలు చాలా ధైర్యవంతులు. ఎప్పుడూ ప్రేమను పంచుతారు. స్త్రీలందరూ ఒక్కటైతే ఆ శక్తిని ఎవరూ ఆపలేరు’ అని రష్మిక మందన్న తన పోస్ట్‌లో తెలిపింది.