సాధారణంగా క్రీడా నేపథ్య చిత్రాలంటే ఏదో ఒక ఆట మీద నడుస్తుంటాయి. కానీ ‘పెద్ది’ అలా కాదు. ఇందులో కథానాయకుడు రామ్‌చరణ్ ఏ ఆటనైనా ఆడగలిగే ప్రతిభాసామర్థ్యాలున్న ఆటకూలీగా కనిపిస్తాడని సమాచారం. దాంతో ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది మార్చి 27న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం దసరా కానుకగా ఈ సినిమాలోని తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నారని తెలిసింది. నాయకానాయికలు రామ్‌చరణ్, జాన్వీకపూర్‌లపై చిత్రీకరించిన మెలోడీ గీతమిదని, దీనికి ఏ.ఆర్.రెహమన్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నందున ఓవైపు షూటింగ్ జరుపుతూనే..దసరా నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నది మేకర్స్ ఆలోచనగా చెబుతున్నారు. జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.