The Family Man 3 actor Rohit Basfore found dead | బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పాపులర్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3లో నటిస్తున్న నటుడు రోహిత్ బస్ఫోర్ (Rohit Basfore) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహం కనిపించింది. నటుడి ఒంటిపై గాయాలు ఉండడంతో అతడిని ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం.. రొహిత్ కొన్ని రోజులు ముందే ముంబయి నుంచి గౌహతికి వచ్చాడని తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లగా ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే జలపాతం వద్ద మృతదేహాం ఉందని పోలీసులకు సమాచారం అందంగా.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రం 6:30 గంటలకు రోహిత్ మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రాథమికంగా ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు రోహిత్‌ను రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరం బాస్ఫోర్ అనే ముగ్గురు వ్యక్తులు పార్కింగ్ విషయంలో బెదిరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, అమర్దీప్ అనే జిమ్ యజమాని రోహిత్‌ను విహారయాత్రకు పిలిచాడని, అతనిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నలుగురు నిందితులు పరారీలో ఉండగా, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
పోస్ట్‌మార్టం నివేదికలో రోహిత్ శరీరంపై తల, ముఖం మరియు ఇతర భాగాలపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది ప్రమాదం కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. రోహిత్ బాస్ఫోర్ ‘ఫ్యామిలీ మ్యాన్ 3’తో పాటు పలు చిత్రాల్లో నటించారు. నటుడిగా, సహాయక సిబ్బందిగా ఆయన సినీ పరిశ్రమలో పనిచేశారు.