The Covenant Movie Review | ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప విషయం. కానీ, సాయం చేయాలనే మనసు ఉన్నా.. చేయగలిగే పరిస్థితులు లేకపోతే ఉపకారం పొందిన వ్యక్తి గుండె ఎంత బరువెక్కుతుందో ఊహించలేం! ఇలాంటి ఓ వాస్తవ కథతో తెరకెక్కిన చిత్రం ‘ద కొవెనంట్’. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికన్ ఆర్మీ కెప్టెన్‌కు ఎదురైన సంఘటనల ఆధారంగా దీన్ని నిర్మించారు. కథలోకి వెళ్తే.. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికన్ ఆర్మీ సైనిక ఆపరేషన్ నిర్వహిస్తుంటుంది. కెప్టెన్ జాన్ కిన్లీ ఆధ్వర్యంలో ఒక సైనిక బృందం నిరంతరం కూంబింగ్ చేస్తుంటుంది. వీరికి స్థానికుడైన అహ్మద్ దుబాసీగా సేవలు అందిస్తుంటాడు. ఒక ఆపరేషన్‌లో జాన్ బృందంపై తాలిబన్లు విరుచుకుపడతారు. జాన్, అహ్మద్ మినహా అందరూ చనిపోతారు. వీరిద్దరూ తప్పించుకుంటారు. తాలిబన్లు వెంబడిస్తారు. ఈ క్రమంలో జాన్‌కు తీవ్ర గాయాలు అవుతాయి. రక్తమోడుతున్న స్నేహితుణ్ని ఎలాగైనా కాపాడుకోవాలని భావిస్తాడు అహ్మద్. తోపుడు బండిపై జాన్‌ను ఉంచి కొండలు, లోయలు దాటుకుంటూ వెళ్తాడు.
దారిలో అడ్డగించిన తాలిబన్లను ప్రాణాలకు తెగించి నిలువరిస్తాడు. చివరికి అమెరికన్ సైనికులకు జాన్‌ను సురక్షితంగా అప్పగిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జాన్ స్వదేశం చేరుకుంటాడు. నాలుగు నెలలకు కోలుకుంటాడు. అమెరికన్ సైనికుణ్ని కాపాడిన అహ్మద్‌పై తాలిబన్లు పగ పెంచుకుంటారు. అతని తలకు వెల కట్టి దొరికితే చంపాలని భావిస్తుంటారు. వాళ్లకు చిక్కకుండా భార్యాబిడ్డలతో అజ్ఞాతవాసం చేస్తుంటాడు అహ్మద్. తనకు ప్రాణభిక్ష పెట్టిన స్నేహితుణ్ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు జాన్. ఈ క్రమంలో అతనేం చేశాడు, స్నేహితుణ్ని రక్షించి తన కృతజ్ఞత చాటుకున్నాడా, లేదా అన్నది మిగిలిన కథ!
ద కొవెనంట్
అమెజాన్ ప్రైమ్: జూలై 20
తారాగణం: జేక్ గిలెన్హాల్,
దార్ సలీమ్, ఆంటోని స్టార్ తదితరులు
దర్శకత్వం: గై రిచీ