Tharun Bhascker Next Film | షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ మొదలు పెట్టి.. ‘పెళ్ళి చూపులు’ సినిమాతో దర్శకుడిగా నేషనల్ అవార్డును అందుకున్నాడు తరుణ్ భాస్కర్. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ పేరు టాలీవుడ్లో మారుమోగిపోయింది. తరుణ్ రైటింగ్‌కు, టేకింగ్‌కు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడు? ఏ స్టార్ హీరోతో తీస్తాడు? అనే క్యూరియాసిటీ అందరిలో ఉండేది. కానీ తరుణ్ అందరి అంచనాలకు భిన్నంగా పరిచయం లేని ముఖాలతో ‘ఈ నగరానికి ఏమైంది’ అని అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.
ఈ చిత్రం తర్వాత అనూహ్యంగా హీరోగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించాడు. అనుకున్న స్థాయిలో చిత్రం ఆడకపోయినా తరుణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈక్రమంలో పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేవాడు. అయితే ఈయన దర్శకుడిగా మళ్ళీ సినిమాలు తీయాలని ఎందరో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తరుణ్ మెగా ఫోన్ పట్టి దాదాపు నాలుగేళ్ళు దాటింది. కారణాలేంటో తెలియదు కాని ఓ ఫుల్ లెంగ్త్ సినిమాను ఇప్పటివరకు తెరకెక్కించలేదు. మధ్యలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన ‘పిట్టకథలు’ సినిమాలో ఓ ఎపిసోడ్‌ను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈయన శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’, విశ్వక్ సేన్ ‘ఓరిదేవుడా’ సినిమాలకు డైలాగ్స్ రాస్తున్నాడు.
కాగా తాజాగా ఈయన తదుపరి సినిమాను ప్రకటించాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో నెక్స్ట్ సినిమాను చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘కీడా కోలా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశాడు. లేటెస్ట్గా విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ‘కీడా’ అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. ఈ టైటిల్ లుక్ పోస్టర్లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్‌పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్‌కి బదులు రక్తం పొంగుతూ బయటికి రావడం మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అలాగే పోస్టర్లో ఒక బొద్దింకను కూడా చూపించారు. ఫస్ట్‌లుక్‌తోనే తరుణ్ ప్రేక్షకులను విపరీతంగా ఇంప్రెస్ చేశాడు. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది.
After successfully following my heart and acting in films that boiled down to small cameos, trying my stint at hosting my own show that got the lowest trps and after redrafting my scripts a zillion times, I'm ready to hit you all with a crime comedy. #keedaacola – TBD pic.twitter.com/FhzVOKkkI3
— Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) June 23, 2022