Naga Chaitanya | ‘శ్రీకాకుళంలోని కొందరు మత్స్యకారుల జీవితం, సముద్రంలో వారు ఎదుర్కొన్న సంఘటనలు దేశం మొత్తాన్ని కదిలించాయి. ఈ కథ వినగానే వెంటనే చేయాలనిపించింది. నా పాత్రలో సహజత్వం కోసం శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపి వారి అనుభవాలను తెలుసుకున్నా. నటుడిగా నాకు మరో స్థాయినిచ్చే చిత్రమవుతుంది’ అన్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటించింది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ ‘రిలీజ్ డేట్‌పై నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇలాంటి సినిమాను ఎప్పుడు విడుదల చేసినా ఆ రోజు పండగలాగే ఉంటుంది. అంత గొప్ప కథతో ఈ సినిమా తెరకెక్కింది’ అన్నారు. చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘పర్ఫెక్ట్ డేట్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకురావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నారు.
ఈ సినిమాను వందకోట్ల క్లబ్లో చేర్చుతామని, సాయిపల్లవి..నాగచైతన్య వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఆ స్థాయి కలెక్షన్స్ సాధించడం పెద్ద విషయమేమీ కాదని, అక్కినేని అభిమానులందరూ కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చేశామని, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులకు నచ్చుతుందని సాయిపల్లవి చెప్పింది. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని దర్శకుడు చందు మొండేటి తెలిపారు.