తందట్టి
అమెజాన్ ప్రైమ్: జూలై 14
తారాగణం: పశుపతి రామస్వామి, రోహిణి, వివేక్ ప్రసన్న తదితరులు.
దర్శకత్వం: రామ్ సంగయ్య.
Thandatti | ప్రయోగాత్మక సినిమాలకు ఓటీటీ మంచి వేదిక అవుతున్నది. ఆలోచింపజేసే కథకు ఆకట్టుకునే కథనం జోడిస్తూ అరుదైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు దర్శకులు. ‘తందట్టి’ ఈ తరహా చిత్రమే!
ఆర్థిక సంబంధాలు మానవీయ బంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో హృద్యంగా చూపించారు డైరెక్టర్ రామ్ సంగయ్య. కథలోకి వెళ్తే వీర సుబ్రమణియన్ (పశుపతి) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. లేనిపోని వ్యవహారాల్లో తలదూర్చి అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు. సుబ్రమణియన్ మరో పది రోజుల్లో పదవీ విరమణ పొందాల్సి ఉండగా, ‘మా బామ్మ (రోహిణి) తప్పిపోయింద’ంటూ ఆమె మనవడు పోలీసులను ఆశ్రయిస్తాడు.
అయితే ఆ కేసు తీసుకోవడానికి ఎవరూ ఒప్పుకోరు. సుబ్రమణియన్ మాత్రం ఆమెను వెతికి తెచ్చే బాధ్యత తనదంటూ హామీ ఇస్తాడు. ఆ మనవడితో కలిసి ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఈ క్రమంలో తన బామ్మ కథంతా హెడ్ కానిస్టేబుల్‌కు వివరిస్తాడు మనవడు. ఆమె కనిపించకుండా పోవడానికి ముందురోజు రాత్రి బామ్మను చెవి దుద్దులు ఇవ్వమన్నానని చెబుతాడు. ఇంతకూ ఆమె ఆచూకీ దొరికిందా? చెవి దుద్దులకూ, ఆమె కనిపించకుండా పోవడానికి సంబంధం ఏమిటి? పరిశోధన కోసం ఆ పెద్దావిడ ఊరికి వెళ్లిన సుబ్రమణియన్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘తందట్టి’ చూడాల్సిందే!