Thammudu | యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరు భావించారు. మూవీ ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. మరోవైపు దిల్ రాజు చిత్ర నిర్మాత కావడంతో, ఈ సినిమాతో నితిన్ ఖాతాలో హిట్ పడడం ఖాయం అనుకున్నారు. కాని చిత్రం విడుదలైన రోజు నుండే నెగెటివ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్‌గా మారింది. ఈ క్రమంలో విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వచ్చేస్తుందన్న వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ చిత్రానికి డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు, ఆగస్ట్ 1 నుంచి ‘తమ్ముడు’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నితిన్ జై అనే ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించాడు. దేశం తరఫున పతకాలు గెలిచే అతడు, తన చిన్ననాటి తప్పు వల్ల అక్క (లయ)తో దూరమవడం, ఆమెను మళ్లీ కలవాలని తీసుకునే ప్రయాణమే సినిమా కథాంశం. ఈ క్రమంలో విశాఖలో జరిగిన భారీ అగ్నిప్రమాదం, దానికి బాధ్యుడైన శక్తిమంతుడు అజర్వాల్ (సౌరభ్ సచ్దేవ్) కుట్రలు, ఝాన్సీకి (లయ) ఎదురయ్యే పరిస్థితులు… చివరకు జై తన కుటుంబాన్ని ఎలా ఏకతాటిపైకి తెచ్చాడు? తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అన్నదే చిత్ర కథ
నితిన్,వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ లయ చాలా ఏళ్ల తర్వాత కీలక పాత్రలో మెరిసింది.స్వాసిక, సౌరభ్ సచ్ దేవ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు సరైన హిట్ లేకపోవడం, ‘రాబిన్ హుడ్’ కూడా ఆశించినంత ప్రభావం చూపకపోవడంతో, ‘తమ్ముడు’పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే థియేటర్లలో మాత్రం ఈ సినిమా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. తమ్ముడు థియేటర్లో మిస్ అయి ఉంటే, త్వరలోనే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. ఆగస్ట్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందంటూ వస్తున్న వార్తలలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. కాగా, తమ్ముడు చిత్రం జూలై 4న విడుదలైన విషయం తెలిసిందే.