Thalapathy Vijay | ఒకప్పుడు తమిళ హీరో విజయ్ అన్నా.. ఆయన సినిమాలన్నా తెలుగులో ఇంత కూడా క్రేజ్ ఉండేది కాదు. అప్పుడే వచ్చిన ప్రేమిస్తే భరత్ లాంటి హీరోల సినిమాలు కూడా చూశారు మన ఆడియన్స్ కానీ ఎందుకో మరి విజయ్ను మాత్రం దూరం పెట్టారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అప్పుడు వద్దన్న హీరోనే ఇప్పుడు కావాలంటున్నారు మన దర్శక నిర్మాతలు. ఒకప్పుడు పోస్టర్ ఖర్చులు కూడా రావు ఈయన సినిమాకు అని వెక్కిరించిన వాళ్ళే.. ఈయన సినిమా కొంటే చాలు సేఫ్ అయిపోతాం అనే నమ్మకాన్ని కలిగించాడు విజయ్. మరీ ముఖ్యంగా కొన్నేళ్లుగా టాలీవుడ్‌పై బలంగా ఫోకస్ చేశాడు విజయ్. ఇక్కడి దర్శకులపై కూడా కన్నేశాడు. గతేడాది వరకు డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేసిన విజయ్.. మొన్నటి సంక్రాంతికి ఏకంగా వంశీ పైడిపల్లి, దిల్ రాజు లాంటి పెద్ద వాళ్లను వెంట పెట్టుకుని వచ్చాడు.
ఓ వైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య.. ఇంకోవైపు బాలయ్య వీరసింహారెడ్డి లాంటి సినిమాలు పోటీలో ఉన్నా కూడా వారసుడుగా వచ్చి విజయం అందుకున్నాడు విజయ్. ఈ సినిమా తమిళంలోనూ విజయం సాధించింది. అక్కడ 300 కోట్లు వసూలు చేసింది వారిసు. దాంతో తెలుగు దర్శకులపై బాగా ఫోకస్ చేశాడు విజయ్. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లితోనే మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు దళపతి. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్‌తో లియో సినిమా చేస్తున్న విజయ్.. ఆ తర్వాత అట్లీతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.
ఇది పూర్తయ్యాక మరోసారి వంశీ పైడిపల్లితోనే సినిమా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతోనూ విజయ్ ఓ సినిమాకు సై అన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ ఇప్పటికే ఓ లైన్ కూడా విజయ్‌కు చెప్పి ఉంచాడని.. ప్రభాస్ స్పిరిట్ అయిపోగానే విజయ్ సినిమా వైపు వస్తాడని తమిళనాట ప్రచారం జరుగుతుంది. ఎలా చూసుకున్నా కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ సాయంతో తెలుగు మార్కెట్‌పై బలంగా కన్నేశాడు విజయ్ అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆయన వేసిన ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.