Thalapathy Vijay | ప్రముఖ కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నటుడు.. త్వరలోనే షూటింగ్స్ని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల్లోకి రానున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి సంబంధించి తొలి సమావేశం, పార్టీ సింబల్‌కు సంబంధించిన వివరాలపై కీలక ప్రకటన చేశారు. పార్టీ తొలి రాష్ట్ర సదస్సు అక్టోబర్ 27న విల్లుపురం జిల్లాలో నిర్వహించనున్నట్లు తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) దళపతి విజయ్ తెలిపారు. అదే సమావేశంలో పార్టీ గుర్తును సైతం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని సలై గ్రామంలో సదస్సు జరుగుతుందని విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆ రోజున పార్టీ కార్యాచరణ ప్రణాళిక సైతం వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. విజయ్ ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే, ఇటీవల ఎన్నికల సంఘం వద్ద పార్టీని పేరును నమోదు చేశారు. ఈ నెల 17న ద్రవిడ ఉద్యమ ప్రముఖుడు పెరియార్ ఈవీ రామస్వామికి విజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురైపై ప్రశ్రంసలు కురిపించారు. తమిళగ వెట్రి కళగం ద్రవిడ భావజాలానికి కట్టుబడి విజయ్ పేర్కొన్నారు. పెరియార్, ఈవీఆర్ను అనుసరించకుండా తమిళనాడులో ఎవరూ రాజకీయాలు చేయలేరని వ్యాఖ్యానించారు.