Murthy | తెలుగు సినీ పరిశ్రమలో జర్నలిస్టులు–దర్శకుల మధ్య ఉన్న సంబంధాలపై తాజా వివాదం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి (దేవి ప్రియ) వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్న మూర్తిపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. జర్నలిజం పేరుతో వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడం, అసోసియేషన్ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు ఆయనపై వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మూర్తిని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గతంలో కూడా ఆయనపై ఆరు నెలల సస్పెన్షన్ విధించి, అనంతరం తిరిగి సభ్యత్వం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, ఈ సస్పెన్షన్పై తెలుగు సినీ దర్శకుల సంఘం స్పందిస్తూ ఘాటైన లేఖను విడుదల చేసింది. TFJA అధ్యక్షుడు, కార్యదర్శికి పంపిన ఈ లేఖలో, మూర్తి ప్రవర్తనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సినిమా జర్నలిజాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ దర్శకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాత్కాలిక సస్పెన్షన్ సరిపోదు.. ఆయన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి అని దర్శకుల సంఘం డిమాండ్ చేసింది. గతంలో సస్పెండ్ చేసి మళ్లీ చేర్చుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని కూడా పేర్కొన్నారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామారావు, కోశాధికారి ఎన్. సాయి రాజేష్ తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. సినిమా ప్రచారంలో కీలక పాత్ర పోషించే జర్నలిస్టులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం పరిశ్రమ ప్రతిష్టకు దెబ్బతీస్తుందని దర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన టాలీవుడ్ జర్నలిజం వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే పరిస్థితి వేడెక్కిన నేపథ్యంలో, దర్శకుల సంఘం డిమాండ్లపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.