సీనియర్ పాత్రికేయుడు, రచయిత కేఏ మునిసురేశ్ పిళ్లె తొలిసారి దర్శకత్వం వహించిన తెలుగు లఘుచిత్రం ‘The 3rd’. సందేశాత్మకంగా సాగే ఈ లఘుచిత్రం ఈ నెల 30న న్యూఢిల్లీలో జరిగే 16వ ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్- 2026’లో ప్రదర్శనకు ఎంపికైంది. చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ వేడుక జరుగుతున్నది. ఇక ఈ లఘు చిత్రం కథ విషయానికి వస్తే.. సృష్టిలోని చర్యలన్నింటికీ తత్సమానమైన ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్స్ థర్డ్ లా. ‘మీరు కష్టపడి చదవకపోతే దానికి ప్రతిచర్యగా మీ జీవితాలు నాశనమైపోతాయి’ అంటూ పిల్లల్ని ఓ ఫిజిక్స్ లెక్చరర్ టార్చర్ పెడుతుంటాడు.
జీవితంలోని ప్రతి విషయానికీ ‘న్యూటన్స్ థర్డ్ లా’ని ఆపాదించి మాట్లాడటం అతనికి అలవాటు. అనుకోకుండా ఆ లెక్చరర్ చేయకూడని ఓ తప్పు చేస్తాడు. ‘న్యూటన్ థర్డ్ లా’ చెప్పినట్టుగానే, తను చేసిన పాపఫలితాన్ని ప్రతిచర్యగా అతను అనుభవించాల్సివస్తుంది. ఇంతకీ ఆ లెక్చరర్ చేసిన తప్పేంటి? ఎదుర్కొన్న ప్రతిచర్య ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ లఘు చిత్రం. అన్ని వయసుల వారూ చూడవలసిన సందేశాత్మక చిత్రమిదని దర్శకుడు కేఏ మునిసురేశ్ పిళ్లె చెప్పారు. ఆదర్శిని శ్రీ, ఒబ్బు ప్రసాద్, ఎస్.రాము, పెమ్మరాజు విజయరామచంద్ర, డా.కిరణ్కుమార్, బాలమురళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ లఘుచిత్రానికి కెమెరా, ఎడిటింగ్: ఆదర్శిని భారతీకృష్ణ, కథ, మాటలు, పాటలు, కథనం, దర్శకత్వం: కేఏ మునిసురేశ్ పిళ్లె, నిర్మాత: భారతమ్మ, నిర్మాణం: ఆదర్శిని చిత్రాలు.