Eesha Movie | నేటి తరం ప్రేక్షకులకు హారర్ థ్రిల్లర్ సినిమాలంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. మసూద వంటి హారర్ థ్రిల్లర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్లో ఒక సినిమా వచ్చింది. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పణలో, శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈషా’. త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించగా సిరి హనుమంతు, పృథ్వీరాజ్, మైమ్ మధు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ మరియు మూఢనమ్మకాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.
కథ
కల్యాణ్ (త్రిగుణ్), వినయ్ (అఖిల్ రాజ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు) నలుగురు ప్రాణ స్నేహితులు. వీరు దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే హేతువాదులు. అమాయక ప్రజలను భయపెట్టి దోచుకునే నకిలీ బాబాల గుట్టు రట్టు చేయడమే వీరి పని. ఈ క్రమంలోనే ఆంధ్ర – ఒడిశా సరిహద్దులో అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం పొందిన ఆది దేవ్ (పృథ్వీరాజ్) అనే బాబా గుట్టురట్టు చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆ బాబా ఈ నలుగురికి ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే మీరేం చేస్తారు? అని సవాలు విసురుతాడు. ఆ సవాలును స్వీకరించిన ఈ నలుగురు ఒక భయంకరమైన పాడుబడిన బంగ్లాలో మూడు రోజుల పాటు నివసించడానికి వెళ్తారు. ఆ బంగ్లాలో వారికి ఎదురైన భయానక పరిస్థితులు ఏమిటి? పుణ్యవతి అనే ఆత్మకు, గిరిజనుడైన మైమ్ మధుకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు ఆ మిత్రులు ఆత్మల ఉనికిని అంగీకరించారా లేదా? అన్నదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ
దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాకపోయినా, దానిని ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సాధారణంగా హారర్ సినిమాల్లో ఉండే రొటీన్ ఫార్మాట్లోనే సినిమా మొదలైనప్పటికీ, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్‌లు మరియు విజువల్స్ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్తాయి. సినిమా మొదటి సగం పాత్రల పరిచయం మరియు బాబా సవాల్‌తో కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే బంగ్లాలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే కొన్ని హారర్ సీన్లు భయపెడతాయి. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఆత్మలు ఎందుకు కనిపిస్తాయి? మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎందుకు ఆత్మగా మిగిలిపోతాడు? అనే అంశాలను క్లైమాక్స్‌లో సైంటిఫిక్ అండ్ ఎమోషనల్ పాయింట్‌తో ముడిపెట్టడం బాగుంది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన లీడ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
నటీనటులు
నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే.. త్రిగుణ్ మరియు హెబ్బా పటేల్ తమ అనుభవంతో పాత్రలకు పూర్తి న్యాయం చేయడమే కాకుండా, సీరియస్ సన్నివేశాల్లో తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాకు అసలైన బలంగా నిలిచిన మైమ్ మధు, గిరిజన పాత్రలో తన ఆహార్యం మరియు నటనతో వెన్నులో వణుకు పుట్టించేలా భయపెట్టారు. బాబా పాత్రలో పృథ్వీరాజ్ చాలా గంభీరంగా కనిపించినప్పటికీ, ఆ పాత్ర నేపథ్యం గురించి కథలో ఇంకాస్త విపులంగా వివరించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక సిరి హనుమంతు మరియు అఖిల్ రాజ్ తమకు కేటాయించిన పరిధి మేరకు చక్కగా నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా
ఆర్.ఆర్. ధృవన్ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. హారర్ సీన్స్‌లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్లో మంచి అనుభూతిని ఇస్తాయి. సంతోష్ విజువల్స్ పాడుబడిన బంగ్లాలోని భయానక వాతావరణాన్ని అద్భుతంగా బంధించాయి. దర్శకుడు శ్రీనివాస్ మన్నె పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. కథనంలో అక్కడక్కడా సాగతీత ఉన్నప్పటికీ, క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభను చాటుతుంది.
ప్లస్ పాయింట్స్:
త్రిగుణ్, హెబ్బా పటేల్, మైమ్ మధుల నటన
హారర్ ఎలిమెంట్స్.
ఆకట్టుకునే క్లైమాక్స్, నేపథ్య సంగీతం.
నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు ఊహకు అందేలా ఉండటం.
ప్రథమార్ధంలో వేగం తగ్గడం.
చివరిగా హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘ఈషా’ ఒక మంచి ఆప్షన్. అక్కడక్కడా భయపెడుతూ, క్లైమాక్స్‌లో ఒక మంచి థ్రిల్‌ను ఇస్తూ ముగుస్తుంది. క్రిస్మస్ వీకెండ్లో ఫ్రెండ్స్‌తో కలిసి చూడదగ్గ సినిమా ఇది.
రేటింగ్: 3/5