Bhadrachalam | భద్రాచలం రాములోరి దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి గల్లంతై.. ఐదుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను నిన్ననే గుర్తించగా.. ఇద్దరి మృతదేహాలను ఇవాళ వెలికితీశారు.
అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పాశం సతీశ్‌కుమార్, కృష్ణా జిల్లా ఉయ్యూరు వాసి తేజజ్ఞసాయి, కృష్ణా జిల్లా కలిదిండికి చండూరి దీపక్, విజయనగరానికి చెందిన గడ్డం హర్షవర్ధన్, కేఎల్‌యూలో బీటెక్ చదివే కృష్ణా జిల్లా ఉయ్యూరు వాసి దగ్గుపాటి నవదీప్(19), భద్రాచలానికి చెందిన చారుగుళ్ల శ్రీకర్(21), పొడిచేటి అభిరామ్(19) స్నేహితులు. వీరంతా గురువారం భద్రాచలానికి చేరుకొని సీతారామచంద్రస్వామిని దర్శించుకుని, దేవస్థానం కాటేజీలో రాత్రి బస చేశారు.
శుక్రవారం ఉదయం ఫొటో షూట్ కోసం భద్రాచలం సమీపంలో ఉన్న కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. అక్కడ గోదావరిలో నీళ్లు లేకపోవడంతో మూడు కిలోమీటర్ల మేర ఇసుకలో నడుచుకుంటూ నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఫొటోలు దిగిన తర్వాత చండూరి దీపక్ మినహా మిగతా ఆరుగురు స్నానాలు చేసేందుకు నదిలోకి దిగారు. కొంచెం ముందుకెళ్లగా లోతు ఉన్న ప్రాంతంలో తొలుత తేజజ్ఞసాయి గల్లంతయ్యాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో చారుగుళ్ల శ్రీకర్, దగ్గుపాటి నవదీప్, పొడిచేటి అభిరామ్, పాశం సతీశ్‌కుమార్, గడ్డం హర్షవర్ధన్ నదిలో గల్లంతయ్యారు. హర్షవర్ధన్‌కు ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు గోదావరిలో గల్లంతయ్యారు. భద్రాచలం నుంచి పోలీసులు, అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లతోపాటు ఏపీలోని యటపాక, కుక్కునూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు శ్రీకర్, పొడిచేటి అభిరామ్, నవదీప్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ సతీశ్, తేజ మృతదేహాలను ఇవాళ వెలికితీశారు.