Tollywood | ఒకప్పుడు హీరో అంటే? రాముడు మంచి బాలుడు టైప్! క్లీన్ షేవ్‌తో, సన్నని మీసకట్టుతో అలరించేవాడు.ఈస్ట్‌మన్ కలర్ రోజుల్లోనూ… హీరోలు మిస్టర్ క్లీన్‌గా సందడి చేశారు. ఇప్పుడు హీరో అంటే.. గడ్డం ఉండాల్సిందే! ఎంత ఎక్కువ ఉంటే.. అంత పెద్ద హీరో అన్నట్టుగా మారింది పరిస్థితి. హ్యాండ్సమ్ హీరోలు గడ్డాన్ని తెగ అభిమానిస్తున్నారు. విపరీతంగా పెంచేస్తున్నారు. పెట్టుడు గడ్డం వద్దు.. పెంచుడు గడ్డమే ముద్దంటున్నారు. కథ, పాత్రతో సంబంధం లేకుండా గడ్డం ఉన్న మగాడిదే డిమాండ్ అంటున్నారు!
ఒడ్డూ, పొడుగుతో పాటు.. సిక్స్ ప్యాక్స్ బాడీ.. ఖరీదైన కాస్ట్యూమ్స్.. క్లీన్ షేవ్.. ఇలా చెబుతూ పోతే హీరో మెటీరియల్ లక్షణాలు ఎన్నో ఉంటాయ్. ఒకప్పుడు టాప్ హీరోలంతా క్లీన్ షేవ్ లుక్‌తో సినిమాల్లో కనిపించేవారు. ఎన్టీఆర్, ఏయన్నార్ ైస్టెల్ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు అదే నీట్ లుక్‌తో కనిపించారు. ‘నా యాల్దీ.. కత్తందుకో’ అంటూ మాస్ డైలాగ్స్ చెప్పిన కృష్ణంరాజు కూడా క్లాస్‌గానే కనిపించేవాడు. పెన్సిల్ మీసకట్టుతో కనికట్టు చేసేవాడు. మూడో తరంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి, బాలయ్య, నాగ్ చాలా వరకు ఇదే పద్ధతిని కొనసాగించారు.
పాత్ర డిమాండ్ చేస్తే తప్పా.. ఎప్పుడూ క్లీన్ అండ్ నీట్‌గా కనువిందు చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలంతా పోటాపోటీగా గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. ‘రంగస్థలం’లో రామ్‌చరణ్, పుష్పలో అల్లు అర్జున్, ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్ దేవరకొండ ఇలా స్టార్లంతా గడ్డం లుక్కు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో బియర్డ్ లుక్‌లోకి మారిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్, దేవరలోనూ అదే కంటిన్యూ చేశాడు. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా దూసుకొస్తున్న తేజా సజ్జ కూడా ఈ గడ్డం గ్యాంగులో చేరిపోయాడు. మనమే కాదు.. గట్టిగా మాట్లాడితే కన్నడ పరిశ్రమలోనూ గడ్డం తెగ పెరిగిపోతున్నది. కేజీఎఫ్‌లో యష్, కాంతారాలో రిషబ్ శెట్టి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. గడ్డాన్ని సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు.
ఒకప్పుడు హీరో అంటే.. హృతిక్ రోషన్‌లా ఉండాలి అనేవాళ్లు. అంతేనా.. గడ్డం, మీసాలు లేకుండా నున్నగా షేవ్ చేసుకుని ‘అబ్బా.. బాలీవుడ్ హీరోలా ఉన్నాడ’ని టాలీవుడ్ హీరోలూ అనేవారు. కొత్తగా ఏ హీరో ఆరంగేట్రం చేసినా.. క్లాస్‌గా కనిపించేవారు. ఈ లుక్‌ను మ్యాన్లీ ైస్టెల్ కమ్మేసింది. మీసాలేంటో తెలియని హృతిక్ కూడా ‘మాస్ కా దాస్’లా మారిపోయాడు. చెప్పాలంటే.. బాలీవుడ్ బాద్షాలు కూడా ఇప్పుడు గడ్డం బాబులే.
ఓ 30 ఏండ్ల కిందట చూస్తే జేడీ చక్రవర్తి గడ్డంతో కనిపించాడు. అప్పట్లో ఆయన్ని ‘గడ్డం చక్రవర్తి’ అనే సినీ అభిమానులు పిలిచేవాళ్లు. ఆనాటి హీరోలకు భిన్నంగా వెరైటీ లుక్‌తో రఫ్‌గా కనిపించేవాడు. ఇంకాస్త సెన్సిబుల్‌గా చూస్తే.. ‘అందాల రాక్షసి’ ప్రేమ కోసం తపించిన నవీన్ చంద్ర గుర్తుకొస్తాడు. గడ్డంతో తను కనిపించని తీరు అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది.
తర్వాత గడ్డంను సింబల్ చేసింది విజయ్ దేవరకొండే. అంతకు ముందు ‘నాన్నకు ప్రేమతో’లో ఎన్టీయార్ క్లాసిక్ గడ్డంతో కనిపించినా.. ‘అర్జున్‌రెడ్డి’లో గుబురు గడ్డం ఎక్కువ ఫేమస్ అయింది. ఒకరకంగా ఈ తరం నటులు గడ్డం కల్చర్‌ని ఫాలో అవ్వడానికి విజయ్ బాటలు పరిచాడు. నాని, విశ్వక్ సేన్, కార్తికేయ లాంటి యువ హీరోలు కూడా గడ్డాలు పెంచేసి హిట్లు కొడుతున్నారు. మరోవైపు నాగ చైతన్య కూడా రఫ్ లుక్ ట్రై చేస్తున్నాడు. ప్రేమకథా చిత్రమైనా, చారిత్రక సినిమా అయినా హీరో గడ్డంతో దర్శనమిస్తున్నాడు.
కథ నేపథ్యం కూడా పట్టించుకోవడం లేదు. అంతెందుకు రామ్‌చరణ్ నటించిన ‘రంగస్థలం’ 1980 దశకం నాటి స్టోరీ! ఆ రోజుల్లో పడుచు పోరగాళ్లు మాసిన గడ్డంతో కనిపిస్తే పెద్దలు తల మొట్టేవాళ్లు. అలాంటిది రామ్‌చరణ్ పాత్ర బారెడు గడ్డంతో కనిపించాడు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరో అజ్ఞాతంలో ఉంటేనో, విలన్ గ్యాంగులో తనను గుర్తుపట్టకుండా ఉండేందుకో గడ్డం పెంచేవాళ్లు. కానీ, ఇప్పుడు గడ్డం ఉంటే గానీ యంగ్ లుక్ రాదని నయా తరం నమ్ముతున్నది.
మరీ అత్యవసరం అయితే చిన్ని గడ్డంలో దర్శనమిచ్చే మహేష్‌బాబు కూడా పూర్తిగా గడ్డం బ్యాచ్ లోకి అప్‌గ్రేడ్ అయిపోయాడు. టక్కరిదొంగ, మహర్షి సినిమాలో ట్రిమ్మింగ్ గడ్డంతో అలరించాడు. ఇప్పుడు రాజమౌళి కాంపౌండ్ నుంచి పిలుపు రాగానే లుక్కే మార్చేశాడు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు. ఇక గడ్డం బ్యాచ్ అనగానే శర్వానంద్, సాయిదుర్గా తేజ్, నాని, రానా గుర్తొస్తారు. జాను సినిమాలో సాల్ట్ అండ్ పెప్పర్ ైస్టెల్లో మెప్పించాడు శర్వా. మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ ‘చిత్రలహరి’లో గడ్డంతో చాలా నేచురల్‌గా నటించాడు. ఇక భిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరించే శ్రీవిష్ణు కూడా ఫుల్ గడ్డం బాబే!! మొత్తంగా ఒకప్పుడు జీవన విధానంలో అడ్డంగా భావించే గడ్డం ఇప్పుడు ఫ్యాషన్ అయింది. సినిమాల్లోనూ విలన్లకు పరిమితమైన గడ్డం హీరోలకు వచ్చిచేరింది.
‘మీసాలు గుచ్చకుండా ముద్దాడతావా నన్ను’ అని హీరోయిన్స్ పాడుకోవడం ఇక కుదరదు. మీసాలు ఏమో గానీ, గడ్డం అడ్డం రావడం ఖాయంగా కనిపిస్తుంది. హిస్టారికల్ సినిమాల్లో అయితే పొడవాటి
జుత్తు, ఒత్తయిన గడ్డం అవసరం. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్ర కోసం చిరంజీవి గడ్డంలో కనిపించారు. ‘గ్యాంగ్ లీడర్’ జమానా నుంచీ చిరు గడ్డంతో కనిపించిన సినిమాలు ఎన్నో! కానీ, మాసిన గడ్డమే కానీ, బారెడు గడ్డంతో కనిపించిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. బాలయ్య బాబు కూడా పాత్ర డిమాండ్ చేస్తే కొద్దిగా గడ్డం పెంచేవాడు. అంతేకానీ, ఇలా అడ్డదిడ్డంగా ఎన్నడూ పెంచుకోలేదు.