కార్మికుల వేతనాలు 30శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆదివారం ప్రకటన విడుదల చేయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఫెడరేషన్ కోర్కెలు చిన్న నిర్మాతల నడ్డి విరిచేలా ఉన్నాయంటూ సోమవారం ఫిల్మ్ ఛాంబర్ మండిపడింది. ఈ వివాదం కారణంగా సోమవారం జరగాల్సిన అల్లరి నరేష్ కొత్త సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరుగుతున్న పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా షూటింగ్‌ని అడ్డుకుంటూ సోమవారం సినీ కార్మిక సంఘాలు ఘర్షణకు దిగాయి. ఈ సమస్యపై సామరస్యపూర్వక పరిష్కారం కోసం కార్మికశాఖ కమీషనర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చల పర్యావసానం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
బంజారాహిల్స్,ఆగస్టు 4: వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్న తెలుగు ఫిలిం ఫెడరేషన్‌కు చెందిన 24 క్రాఫ్ట్స్ కార్మికులను పక్కన పెట్టి ఇతర రాష్ర్టాలనుంచి తీసుకువచ్చిన కార్మికులతో షూటింగ్ నిర్వహిస్తున్న వ్యవహారంతో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోవద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌ను బొంబాయి, చెన్నైకి చెందిన కార్మికులతో చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కార్మికులు అన్నపూర్ణ స్టూడియోలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారంతా స్టూడియో గేటుముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
30శాతం వేతనాలను పెంచాలంటూ గత నాలుగు నెలలుగా ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంటే సమయం ఇవ్వాలంటూ కాలయాపన చేశారని కార్మికులు ఆరోపించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 12 సినిమాలకు సంబంధించిన నిర్మాతలు వేతన పెంపుకు అంగీకరించగా, మైత్రీ మూవీస్ సంస్థ మాత్రం ససేమిరా అంటూ మొండికేసిందనీ, పైగా ఫెడరేషన్‌కు చెందిన కార్మికులను కాకుండా బయటి ప్రాంతాలనుంచి కార్మికులను తెచ్చి షూటింగ్ కొనసాగించడం దారుణమని ఆరోపించారు. మైత్రీ మూవీస్‌కు చెందిన 6 సినిమాల కోసం పనిచేసిన ఫెడరేషన్ కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారు 2గంటలపాటు ఆందోళన అనంతరం ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలకు పిలవడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.
సినీ కార్మికుల వేతన పెంపును నిర్మాతలంతా వ్యతిరేకించారని తెలియజేస్తూ సోమవారం టీఎఫ్‌సీసీ (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సామరస్యపూర్వక పరిష్కారం కోసం కార్మికశాఖ కమీషనర్ మార్గదర్శకత్వంలో చర్చలు జరుగుతున్న వేళ, లేబర్ కమీషనర్ మాటలను ధిక్కరిస్తూ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కనీస వేతన చట్టం ప్రకారం.. ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉంది.
కార్మిక శాఖ కమీషనర్‌తోపాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా నిర్మాతల స్వయం ప్రతిపత్తిని సమర్థిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది.’ అని ప్రకటనలో టీఎఫ్‌సీసీ పేర్కొంది. ఇతర సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు సినీ పరిశ్రమలో ఇస్తున్న వేతనలు చాలా ఎక్కువని, నిర్మాతలు ఇవ్వగలిగే వేతనానికి పని చేయాలనుకున్న వర్కర్లు యూనియన్‌లో లేకపోయినా.. వారితో షూటింగ్ చేయించుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని, సభ్యత్వం పేరుతో లక్షలు డిమాండ్ చేస్తూ ఔత్సాహికులు ఇండస్ట్రీకి రాకుండా అవరోధాలు కలిగిస్తున్నారని కార్మిక యూనియన్లపై నిర్మాతలు ప్రకటనలో మండిపడ్డారు.