ముప్పైశాతం వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో తెలుగు సినీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతున్నది. దీంతో సినిమా షూటింగ్‌లన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. మరోవైపు వరుస భేటీలతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలను కలిసిన పలువురు నిర్మాతలు.. కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులతో నిర్మాతలు మరియు ఫిల్మ్ ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్ధేశిత సమయానికి కాల్షీట్స్ ఇవ్వాలని, ఇక్కడి అవసరాలకు సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్‌తో కూడా పనిచేయించుకుంటామని (స్కిల్ ఆధారంగా వేరే రాష్ట్రాల వారిని కూడా తీసుకోవడం), షూటింగ్ ఎక్కడ చేసినా రేషియో అనేది ఉండకూడదని, ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో పనికి మాత్రమే డబుల్ కాల్షీట్, మిగతా ఆదివారాల్లో సింగిల్ కాల్షీట్ ఇచ్చేలా నాలుగు డిమాండ్లను నిర్మాతలు ఫెడరేషన్ ముందుంచారు. ఈ ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే కార్మికుల వేతన పెంపుపై నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు తెలిపారు.
నిర్మాతలు తమ ముందుంచిన నాలుగు ప్రతిపాదనల్లో రెండింటికి అంగీకరించామని, మిగతా రెండింటిపై యూనియన్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. ఈ సమస్యను ఫిల్మ్‌ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనే పరిష్కరించుకుంటామని, శనివారం మరోమారు సమావేశమవుతామని పేర్కొన్నారు.
‘మేము 30శాతం వేతన పెంపు ఇస్తున్న నిర్మాతలకు షూటింగ్స్ చేస్తున్నాం. ఇక చిన్న నిర్మాతల ప్రపోజల్స్ మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. చిన్న నిర్మాతలకు మా మద్దతు ఉంటుంది’ అని అనిల్ వల్లభనేని తెలిపారు. చర్చలు సుహృద్భావపూరిత వాతావరణంలో జరిగాయని, మరో రెండుమూడు సమావేశాలతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉందని, కార్మికులు, నిర్మాతలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని కోఆర్టినేషన్ కమిటీ ఛైర్మన్ వీరశంకర్ పేర్కొన్నారు. వేతన వివాదం రావడం తొలిసారి కాదని, ఈ సమస్య త్వరలో సమసిపోతుందనే నమ్మకం ఉందని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.