తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. తాము ఆశించినట్టు వేతనాన్ని 30శాతం పెంచిన నిర్మాతల షూటింగులకు మాత్రమే సోమవారం(నేడు) నుంచి కార్మికులు హాజరు కావాలని ఆదివారం ఫెడరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. సినీ కార్మికుల వేతనాల విషయంపై గత కొన్ని రోజులుగా ఫిల్మ్ ఛాంబర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ చర్చలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సర్వసభ్యసమావేశం జరిగింది. ఇందులో భాగంగా వేతనాల పెంపు విషయంలో పోరాడేందుకు ఓ సమన్వయ కమిటీని ఫెడరేషన్ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి వీరశంకర్, సయ్యర్ హుమయూన్‌లు అధ్యక్షులుగా నియమితులయ్యారు. 30శాతం వేతనాన్ని పెంచేందుకు అభ్యంతరం లేదని తెలిపే సదరు నిర్మాతల ఒప్పంద పత్రాలు ఫేడరేషన్ ద్వారా యూనియన్లకు చేరిన తర్వాతే షూటింగులకు హాజరు కావాలని, అప్పటివరకూ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులెవరూ సినిమా, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ఎటువంటి విధులకూ హాజరు కాకూడదని ఫెడరేషన్ నిర్ణయించింది. తెలుగు సినిమాల షూటింగులు ఎక్కడ జరిగినా, అంతేకాక ఇతర భాషా చిత్రాలకు పనిచేయాలనుకున్నా కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని ఫెడరేషన్ ప్రకటనలో పేర్కొన్నది.
సోమవారం జరగాల్సివున్న అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఫెడరేషన్ నిర్ణయం కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడ్డాక సినిమా షూటింగ్ నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు.