Peddi Movie | టాలీవుడ్లో కొత్త వివాదం.. రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాకూ పర్సంటేజ్ కావాల్సిందేనంటున్న ఎగ్జిబిటర్లు!
Peddi Movie | తెలంగాణ చిత్ర పరిశ్రమలో థియేటర్ల నిర్వహణపై తీవ్రమైన సంక్షోభం నెలకొంది. ఇకపై రాష్ట్రంలో పర్సంటేజ్ ప్రాతిపదికన మాత్రమే సినిమాలను ప్రదర్శిస్తామని, పాత అద్దె విధానాన్ని పూర్తిగా పక్కనబెడుతున్నామని తెలంగాణ ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పారు.
Telangana Exhibitors | తెలంగాణ చిత్ర పరిశ్రమలో థియేటర్ల నిర్వహణపై తీవ్రమైన సంక్షోభం నెలకొంది. ఇకపై రాష్ట్రంలో పర్సంటేజ్ ప్రాతిపదికన మాత్రమే సినిమాలను ప్రదర్శిస్తామని, పాత అద్దె విధానాన్ని పూర్తిగా పక్కనబెడుతున్నామని తెలంగాణ ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పారు. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో అత్యవసరంగా సమావేశమైన ఎగ్జిబిటర్లు ఈ మేరకు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మైలురాయిగా భావిస్తున్న రామ్‌చరణ్, బుచ్చిబాబుల క్రేజీ కాంబినేషన్ చిత్రం ‘పెద్ది’ కి కూడా ఈ పర్సంటేజ్ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేయడంతో టాలీవుడ్లో కొత్త చర్చ మొదలైంది. గతంలో ‘హరి హర వీరమల్లు’ విడుదల సమయంలోనే ఎగ్జిబిటర్ల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, ఏడాది గడుస్తున్నా నిర్మాతలు కాలయాపన చేస్తున్నారని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం వారం చర్చలను వాయిదా వేస్తూ నిర్మాతలు కావాలనే ఆలస్యం చేస్తున్నారని, అందుకే తాము ఈ కఠిన నిర్ణయానికి రావలసి వచ్చిందని ఆయన వివరించారు.
ఒకప్పుడు లాభాలతో కళకళలాడిన థియేటర్ల వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మంది థియేటర్ల యజమానులు దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారని ఎగ్జిబిటర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిర్మాతలకు ఓటీటీ, శాటిలైట్ సహా 14 రకాల విభిన్న మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంటే, థియేటర్ల యజమానులకు మాత్రం కనీస రెవెన్యూ రావడం లేదని వారు పేర్కొన్నారు. దేశమంతటా థియేటర్లలో పర్సంటేజ్ విధానమే విజయవంతంగా నడుస్తోందని, ఇక్కడ మాత్రం పాతకాలపు రెంటల్ పద్ధతిని రుద్దడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. థియేటర్లోని ఏసీ, సౌండ్ సిస్టమ్ ఆధారంగా కాకుండా, అక్కడ వచ్చే కలెక్షన్లను బట్టే గ్రేడింగ్ చేయాలని డిమాండ్ చేశారు. టికెట్ల రేట్ల పెంపుదలపై స్పందిస్తూ, ‘పెద్ది’ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో రేట్లు పెంచుకోవచ్చు కానీ, తెలంగాణలో మాత్రం టికెట్ ధరలు పెంచవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఛాంబర్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. ‘పెద్ది’ లాంటి భారీ చిత్రాలపై తమకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, అయితే ఈ సమస్యను ఇప్పుడే తేల్చకపోతే భవిష్యత్తులో ఎగ్జిబిటర్ల మనుగడ కష్టమవుతుందనే ఉద్దేశంతోనే ఈ సినిమాను కూడా పర్సంటేజ్ శ్లాబ్‌లోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు.
పరిశ్రమలో నెలకొన్న ఈ కీలక పరిణామాల మధ్యే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన సారథి ఎన్నిక కూడా ముగిసింది. సంస్థ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎగ్జిబిటర్ల ప్రయోజనాలే ధ్యేయంగా కొత్త కమిటీ పనిచేస్తుందని ఈ సందర్భంగా ప్రతినిధులు నమ్మకం వ్యక్తం చేశారు. థియేటర్ల మనుగడను కాపాడుకునేందుకు తామంతా కలిసికట్టుగా ముందడుగు వేస్తామని ప్రకటించారు. ఈ అత్యవసర విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్, రవీంద్ర గోపాల్ తదితర ప్రముఖ థియేటర్ల యజమానులు, ప్రతినిధులు పాల్గొని ఎగ్జిబిటర్ల ఐక్యతను చాటారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

