Betting Apps | బెట్టింగ్ యాప్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో సీరియస్ అయిన తెలంగాణ పోలీసులు పలువురు సెలబ్రిటీలతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ వివాదంలో నటి విష్ణుప్రియ (Vishnupriya)ను విచారణకు రావాలని మియాపూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. అయితే మార్చి 25న కూడా విచారణ ఉండగా.. ఈ సందర్భంలో, తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రోజు ఆమె పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి మరియు దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు తిరస్కరించింది.
అంతేకాకుండా.. ఈ కేసులో పోలీసులతో సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు సూచించింది. అదే విధంగా, చట్టబద్ధంగా దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు మియాపూర్, పంజాగుట్ట పోలీసులు పలువురు నటులు, ఇన్ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో వారిని పోలీస్ స్టేషన్కు రప్పించి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ముందస్తు చర్యగా హైకోర్టును ఆశ్రయిస్తూ బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.