సినిమా టికెట్ ధరలను సవరిస్తూ కొత్తగా జారీ చేసిన జీవో నెం. 77ను సమీక్షించాలని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సవరించిన టికెట్ విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్ల టికెట్ ధరల కొత్త వర్గీకరణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సవరించిన ధరల వల్ల చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని థియేటర్లపై అదనపు భారం పడే అవకాశం ఉందని ఛాంబర్ అభిప్రాయపడింది. టికెట్ ధరల నిర్ణయంపై నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో పాటు సంబంధిత భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలని ఛాంబర్ ప్రభుత్వాన్ని కోరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యల్ని పరిష్కరించే విషయంలో చొరవ తీసుకోవాలని కోరింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిల్మ్ ఛాంబర్ ఓ లేఖ రాసింది.
టికెట్ ధరలపై తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరలను ఖరారు చేస్తూ విడుదల చేసిన ఉత్తర్వులను ఎగ్జిబిటర్లు ఖండించారు. ఈ విషయమై త్వరలో సీఎంకు లేఖ రాయాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వానికి పదిరోజుల గడువు ఇచ్చి కోర్టుని ఆశ్రయిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి టికెట్ రేట్లను సవరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
సినీరంగంలోని ఏ నిర్ణయాధికార సంస్థతో సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వసతుల ఆధారంగా థియేటర్లను వర్గీకరణ చేయడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు, చిన్న పట్టణాల్లోని థియేటర్ల నిర్వహణపై ఆర్థికభారం పడే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్ల సవరణ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, లేని పక్షంలో న్యాయపరంగా ముందుకెళ్లాలనే యోచనలో ఎగ్జిబిటర్లు ఉన్నట్లు తెలిసింది.