Nara Drishti Row | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘నర దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రతిపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ మంత్రులు మూకుమ్మడిగా దాడికి దిగారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడుతూ.. పవన్ రాజకీయ ప్రయాణాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా గెలవలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. సొంతగా ఎన్నికల్లో గెలవలేక, కమ్మ, కాపు సామాజిక వర్గాలను ఏకం చేసి సినిమాలో లాగా సమయానికి చంద్రబాబు వచ్చి కాపాడితే గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యావు. అసలు తెలంగాణ మీద నీకెందుకు అంత ఏడుపు? తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నావా? అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ వివాదంపై పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.