తేజ సజ్జా కథానాయకుడిగా సూపర్‌హీరో కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సూపర్‌యోధ పాత్రలో కనిపించారు తేజ సజ్జా. విధ్వంసక శక్తి నుంచి మావవాళిని రక్షించడం అతని విధి. దైవిక బలాన్ని పొందిన అతను చేసిన సాహసాలతో ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగింది.
‘దునియాలో ఏదీ నీది కాదు’ ‘నా గతం నక్షత్రం.. నా ప్రస్తుతం ఊహాతీతం’ వంటి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ..ఈ సినిమాలో ఎన్నో గూజ్బంప్స్ మూమెంట్స్ ఉంటాయని, ఒక తల్లి కోసం కొడుకు ఎంత దూరం వెళ్లాడన్నదే కథలో ప్రధానాంశమని తెలిపారు.
అశోకుడు రాసిన తొమ్మిది పుస్తకాల గురించి ప్రపంచానికి చెప్పాలనే సంకల్పంతో దర్శకుడు ఈ కథను రాశాడని మంచు మనోజ్ అన్నారు. ఈ సినిమాలో తాను కథానాయకుడి తల్లి పాత్రలో కనిపిస్తానని శ్రియ శరణ్ తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.