సినిమా పేరు: మిరాయ్
తారాగణం: తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతిబాబు..
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాణంలో ఉండగానే అంచనాలు క్రియేట్ చేసిన సినిమా ‘మిరాయ్’. ‘హను-మాన్’ తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న సూపర్‌హీరో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పాడ్డాయి. దానికి తగ్గట్టే ప్రచారచిత్రాలు సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘మిరాయ్’ విడుదలైంది. మరి అందరి అంచనాలనూ ‘మిరాయ్’ అందుకున్నదా? ‘హను-మాన్’తో పానిండియా హిట్ అందుకున్న తేజ సజ్జాకు ‘మిరాయ్’ మరో విజయాన్ని అందించిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ:
కళింగ యుద్ధానంతరం రక్తపాతాన్ని చూసి వైరాగ్యభావాన్ని పొందిన అశోకుడు, సమస్త సామ్రాజ్యాన్నీ పరిత్యజించి సన్యసించాలని నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగా తనలోని దైవీక శక్తులన్నింటినీ తొమ్మిది గ్రంధాల్లో నిక్షిప్తం చేసి, వాటి రక్షణార్థం ఎనిమిది గ్రంధాలను ఎనిమిదిమంది యోధులకు అందజేస్తాడు. ఒక పుస్తకాన్ని మాత్రం ఓ ఆశ్రమానికి అందిస్తాడు. అవి దుష్టులకు చేరితే సృష్టికే అనర్థం అని తెలియజేస్తాడు. అశోకుడి అజ్ఞానుసారం ఆ గ్రంధాలు ఆయా ప్రదేశాల్లో తరతరాలుగా రక్షణ పొందుతూ ఉంటాయి. వాటిని కైవసం చేసుకోవాలని ప్రయత్నించి ప్రతి దుష్టశక్తీ అంతమైపోతూ ఉంది. ఈ క్రమంలో తాంత్రిక విద్యలలో నిష్ణాతుడు, భగవంతుడి సృష్టిమీదే కోపాన్ని పెంచుకున్న దుర్మార్గుడు, అతి బలవంతుడూ అయిన బ్లాక్స్వార్డ్ అమరత్వ సిద్ధి కోసం ఆ తొమ్మిది గ్రంధాలనూ కైవసం చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయాన్ని ముందుగానే తన దివ్యదృష్టితో కనుకొన్న తొమ్మిదవ గ్రంధం రక్షకురాలు అంబిక(శ్రియ శరణ్) మిగతా ఎనిమిది గ్రంధాల రక్షకులనూ ముందుగానే హెచ్చరిస్తుంది. కానీ వాళ్లు బ్లాక్‌స్వార్డ్‌ను తేలిగ్గా తీసుకుంటారు. వాడు ఎప్పటికైనా ఎనిమిది గ్రంధాలనూ కైవసం చేసుకొని తొమ్మిదో గ్రంధంకోసం తన దగ్గరకే వస్తాడని ముందే గ్రహించిన అంబిక.. అగస్త్యమహామునిని ఆశ్రయిస్తుంది. ఆ బ్లాక్ స్వార్డ్ను చంపే శక్తి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకే ఉన్నదన్న విషయం అగస్త్యుని ద్వారా తెలుసుకున్న అంబిక.. అగస్త్యుని సూచన మేరకు ఆ బిడ్డ పుట్టగానే, కాశీలో వదిలి వెళ్లిపోతుంది. అలా అనాధగా పెరిగిన వేద(తేజ సజ్జా)కు 24 ఏళ్లు వస్తాయి. అనుకున్నట్టే బ్లాక్ స్వార్డ్ ఎనిమిది గ్రంధాలనూ కైవసం చేసుకొని తొమ్మిదో గ్రంధం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలవల్ల వేదకు తన జన్మ రహస్యం తెలుస్తుంది. హిమాలయాల్లో నరమానవులు సైతం ప్రవేశించలేని ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న ‘మిరాయ్’ని సాధిస్తే తప్ప బ్లాక్ స్వార్డ్ను మట్టుపెట్టలేమని తెలుసుకుంటాడు. మరి వేదా ‘మిరాయ్’ని ఎలా సాధించాడు? వేదా సూపర్ యోధాగా ఎలా మారాడు? బ్లాక్ స్వార్డ్ని ఎలా అంతం చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
ఒక చెడు పుట్టినప్పుడు దాన్ని అంతం చేసేందుకు కచ్ఛితంగా ఓ మంచి కూడా ఆవిర్భవిస్తుందని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. బ్లాక్ స్వార్డ్ అనే సృష్టి వినాశకరుడు పుట్టినప్పుడు వాడ్ని అంతం చేసేందుకు వేదా పుట్టాడు. తను సూపర్యోధాగా మారి బ్లాక్స్వార్డ్ని అంతం చేశాడు. సింపుల్‌గా ఇదే ‘మిరాయ్’ కథ. ఇలాంటి కథలకు లాజిక్కులు వెతక్కూడదు. ఇదొక ఫిక్షన్. ఓ అందమైన చందమామ కథ. ‘ఇలా జరిగితే బావుండు’ అనిపించే అందమైన ఊహ. దాన్ని గొప్పగా ఆవిష్కరిస్తే సినిమా హిట్. ఇక్కడ చెప్పే విషయం ఆసక్తికరంగా ఉంటే చాలు. ఈ విషయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఆసక్తికరమైన పాయింట్‌ని ఎంచుకొని, దాన్ని అంతే ఆసక్తికరంగా తెరకెక్కించాడు. బలమైన ప్రతికూల శక్తిని ఎదురుగా నిలబెట్టి, దాన్ని మట్టుపెట్టే క్షణంకోసం ఉత్కంఠతో ఆడియన్ ఎదురు చూసేలా చేశాడు. హీరో కంటే విలన్ శక్తిమంతుడైనప్పుడే ఆడియన్స్‌లో ఆసక్తి పెరుగుతుంది. అలవిగాని లక్ష్యాన్ని అధిగమించినప్పుడు వచ్చే కిక్ సామాన్యంగా ఉండదు. ‘మిరాయ్’ ఆడియన్స్‌కి అలాంటి కిక్‌నే ఇచ్చింది. ప్రథమార్ధం అంతా పాత్రల పరిచయాలతోనే ఎక్కువశాతం నడిచింది. కానీ ఎక్కడా విసుగు అనిపించదు. ద్వితీయార్ధం అసలు కథ మొదలవుతుంది. అడుగడుగునా ఉత్కంఠ, ఊహించని మలుపులు. ఇక ైక్లెమాక్స్‌లో శ్రీరాముడి ఎపిసోడ్ గూజ్బంప్స్ తెప్పిస్తుంది.
నటుటీనటుల పనితీరు:
తేజ సజ్జా కథల విషయంలో మంచి జడ్జిమెంట్ ఉన్న హీరో అని ‘మిరాయ్’తో మారుసారి రుజువైంది. ‘హను-మాన్’లో కంటే ఈ సినిమాలో జోష్‌గా కనిపించారాయన. అంతేకాదు, నటనలో కూడా పరిపక్వత కనిపించింది. కామెడీ, ఎమోషన్స్ అన్నీ బాగా పలికించాడు. పోరాటాల్లోనూ సత్తా చాటాడు. భవిష్యత్‌లో పెద్ద మాస్ హీరో అయ్యే లక్షనాలు తేజ సజ్జాలో ప్రస్పుటంగా కనిపించాయి. ఇక మంచు మనోజ్.. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా ఫస్ట్ మార్క్ మంచు మనోజ్‌కే వేయాలి. ఇందులో ఆయన విలన్ బ్లాక్ స్వార్డ్గా కనిపించారు. 40ఏండ్ల క్రితం మోహన్‌బాబు ఈ బ్లాక్ స్వార్డ్ పాత్రను పోషించాల్సి వస్తే ఆయన ఎలా చేసేవాడో.. సరిగ్గా మనోజ్ కూడా అలాగే చేశారు. ఆయన హావభావాలు, అభినయం, వాచకం అన్నీ తన తండ్రి మోహన్‌బాబును గుర్తు చేశాయి. ప్రతినాయకుడిగా అద్భుతంగా సెటిల్డ్‌గా నటించాడు. నటుడిగా మంచు మనోజ్‌కు ‘మిరాయ్’ పెద్ద బ్రేక్ అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఉన్నంతలో తమ పాత్రలకు శ్రియ, రితికా, జగపతిబాబు న్యాయం చేశారు.
సాంకేతికంగా
ఈ సినిమా విషయంలో ముందు అభినందించాల్సింది దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. మంచి కథను ఎంచుకొని దానికి, అద్భుతమైన కథనాన్ని జోడించి, జనరంజకంగా తెరకెక్కించారు కార్తీక్ ఘట్టమనేని. అంతేకాదు.. తను స్వతహాగా ఛాయాగ్రాహకుడు కావడం చేత కెమెరా వర్క్ కూడా చాలా బావుంది. ఇక గౌరహరి నేపథ్య సంగీతం అయితే సినిమాను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టింది. అయితే.. జనం నోళ్లలో విపరీతంగా నానిన ‘వైబుంది బేబీ.. వైబుందిలే..’ సాంగ్ సినిమాలో లేకపోవడం కాస్త డిసప్పాయింట్‌గా అనిపించింది. సెకండాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా.. కథలోకి వెళ్లడం వల్ల ఆమాత్రం ల్యాగ్ సహజం. అదేం పెద్ద సమస్య కూడా కాదు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిర్మాణ విలువలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెట్టిన ప్రతి పైసా తెరపై కనిపించింది. కేవలం కథను నమ్మి కోట్లు కుమ్మరించి ఈ సినిమా నిర్మించారు టీజీ విశ్వప్రసాద్. మొత్తానికి ‘మిరాయ్’ అందరికీ నచ్చే సినిమా. ముఖ్యంగా చిన్నపిల్లలను విపరీతంగా ఆకట్టుకునే సినిమా.
బలాలు
కథ, కథనం, నటీనటుల అభినయం, మ్యూజిక్…
బలహీనతలు
సెకండాఫ్ కాస్త స్లో..
రేటింగ్ – 3/5