వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ‘చంటబ్బాయి గారి తాలూకా’ ఉపశీర్షిక. మోహన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వెన్నపూస రమణా రెడ్డి నిర్మాత. డిసెంబర్ 25న విడుదల కానుంది. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. పోలీస్ అధికారి తాను పరిష్కరించాల్సిన ఓ క్రిమినల్ కేసును శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ పేరుతో డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న వెన్నెల కిషోర్‌కు అప్పగించడం, కేసు విచారణలో ఆయన పండించిన హాస్యంతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా హక్కులను వంశీ నందిపాటి తీసుకోవడంతో మాకు ధైర్యం వచ్చింది. సినిమాలపై ఆయన జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. కామెడీ కలబోసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. ఇదొక ఫుల్మీల్స్లాంటి సినిమా అని కథానాయిక అనన్య నాగళ్ల పేర్కొంది. ఈ సినిమా చూస్తూ ఆద్యంతం మెస్మరైజ్ అయ్యానని నిర్మాత వంశీ నందిపాటి తెలిపారు. సీయాగౌతమ్, స్నేహగుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, రచన, దర్శకత్వం: రైటర్ మోహన్.